నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఉన్న రాజీవ్ కుమార్ తన పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు ప్రభుత్వానికి తన రాజీనామా లేఖను అందజేశారు. దీనిని ఆమోదించిన ప్రభుత్వం కొత్త వైస్ చైర్మన్ గా సుమన్ కె బేరీని నియమించింది. 

న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న హ‌ఠాత్తుగా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కొత్త వైస్ చైర్మ‌న్ గా సుమన్ కె బేరీని ప్రభుత్వం శుక్రవారం నియమించింది. బెరీ మే 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీక‌రించనున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజీవ్ కుమార్ ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు పదవీలో కొన‌సాగుతార‌ని పేర్కొది. 

నీతి ఆయోగ్ ఏర్ప‌డిన నాటి నుంచి వైస్ చైర్మ‌న్ గా అరవింద్ పనగారియా బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. అయితే ఆయ‌న 2017లో త‌న బాధ్య‌త‌ల నుంచి వైదొలిగారు. దీంతో ప్ర‌ముఖ అర్థిక వేత్త అయిన రాజీవ్ కుమార్ వైస్ చైర్మ‌న్ గా ప్ర‌భుత్వం నియ‌మించింది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆ ప‌ద‌విలో కొన‌సాగుతూ వ‌చ్చారు. స‌డెన్ గా ఆయ‌న రాజీనామా చేయ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త వ్య‌క్తిని నియ‌మించాల్సి వ‌చ్చింది. అయితే ఆయ‌న రాజీనామాను ప్ర‌భుత్వం ఆమోదించిన‌ప్ప‌టికీ ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ప‌ద‌విలో కొన‌సాగాల‌ని సూచించింది. 

నీతి ఆయోగ్ వ్యవసాయం, అసెట్ మానిటైజేషన్, డిజిన్వెస్ట్‌మెంట్, ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటిపై దృష్టి సారించింది. ఈ విధానాల రూపకల్పనలో రాజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయ‌న ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో DPhil, లక్నో విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందారు. ఆయ‌న‌ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR)లో సీనియర్ ఫెలో గా కూడా ఉన్నారు. 

కొత్తగా బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నసుమన్ కె బేరీ ఇంతకు ముందు న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER)కి డైరెక్టర్ జనరల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా పనిచేశారు. ఆయ‌న ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో స‌భ్యుడిగా కూడా ఉన్నారు.