Rajiv Gandhi Case: రాజీవ్ గాంధీ హత్యకేసు టైమ్‌లైన్.. దోషి పెరరివాలన్ వాంగ్మూలాన్ని మార్చిన సీబీఐ మాజీ అధికారి!
రాజీవ్ గాంధీ హత్య కేసు టైమ్‌లైన్ పరిశీలిస్తే సంచలన విషయాలు కనిపిస్తాయి. 1991లో అరెస్టు అయిన ఏజీ పెరరివాలన్ తాజాగా సుప్రీంకోర్టు విడుదల ఆదేశాలతో 31 ఏళ్ల తర్వాత కేసు నుంచి బయటపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సీబీఐ మాజీ అధికారి వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. 1991లో రాజీవ్ గాంధీ హత్య సమయంలో పెరరివాలన్‌కు 19 ఏళ్లు. రాజీవ్ గాంధీని చంపడానికి ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన బెల్ట్ బాంబు కోసం రెండు 9 వోల్టుల బ్యాటరీలను స్వయంగా కొనుగోలు చేశాడని పెరరివాలన్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 1998లో టాడా కోర్టు పెరరివాలన్‌కు మరణ శిక్ష విధించింది. తర్వాతి ఏడాదే ఈ శిక్షణను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ, 2014లో మరణ శిక్షను జీవిత ఖైదుగా కుదించింది. ఈ ఏడాది మార్చిలోనే పెరరివాలన్‌కు బెయిల్ మంజూరు చేసింది. పెరరివాలన్‌ను ఈ కేసు నుంచి విడుదల చేస్తూ వెలువరించిన ఈ తీర్పు.. మిగతా ఆరుగురు దోషులకూ ఉపశమనం ఇవ్వడానికి దారి వేస్తుందని భావిస్తున్నారు.
పెరరివాలన్ కేసును పరిశీలిస్తే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన కేసు నుంచి బయట పడ్డ సందర్భంగా ఆ కేసు టైమ్‌లైన్‌ను పరిశీలిద్దాం.
1991 మే 21: తమిళనాడులోని శ్రీపెరుంబుదుర్‌లో రాత్రి 10.20 గంటల ప్రాంతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేవారు. ధను అనే మహిళ బెల్ట్ బాంబ్‌తో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఇందులో రాజీవ్ గాంధీ సహా మరో 16 మంది మరణించారు.
1991 మే 22: రాజీవ్ గాంధీ హత్య కేసు విచారించడానికి సీబీ-సీఐడీ టీమ్ ఏర్పడింది.
1991 మే 24: రాష్ట్రపతి పాలన కాలంలో ఈ కేసు విచారణను సీబీఐ సిట్‌కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
1991 జూన్ 11: ఈ కేసులో 19 ఏళ్ల ఏజీ పెరరివాలన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇతరులపై ప్రయోగించిన టాడా ఆరోపణలపై ఇతడినీ అరెస్టు చేసింది.
1992 మే 20: మొత్తం 41 మంది నిందితులపై సిట్ అభియోగాలు మోపింది.
1998 జనవరి 28: సుదీర్ఘ విచారణ తర్వాత టాడా కోర్టు నళిని, పెరరివాలన్ సహా 26 మంది నిందితులకు మరణ శిక్ష విధించింది.
1999 మే 11: నళిని, నళిని భర్త మురుగన్, సంతన్, పెరరివాలన్‌లకు మరణ శిక్షను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మిగతా ముగ్గురికి మరణ శిక్షనూ సమర్థిస్తూ 19 మంది నిందతులను విడుదల చేసింది. టాడా అభియోగాలను తొలగించింది
2000 ఏప్రిల్: తమిళనాడు క్యాబినెట్ సిఫారసుల మేరకు అప్పటి గవర్నర్ నళిని మరణ శిక్షను జీవిత ఖైదుగా కుదించారు.
2001: మరణ శిక్ష పొందిన దోషులు సంతన్, మురుగన్, పెరరివాలన్.. రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ వేశారు.
2006: పెరరివాలన్ తన ఆత్మకథలో సంచలన విషయాలు పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి తెచ్చి బాంబ్ బ్యాటరీలను తానే కొనుగోలు చేసినట్టు వాంగ్మూలం ఇప్పించారని, అందుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించాడు.
2011 ఆగస్టు 11: 11 ఏళ్ల తర్వాత వారి క్షమాభిక్ష వ్యాజ్యాన్ని అప్పటి ప్రతిభా పాటిల్ తిరస్కరించింది.
2011 ఆగస్టు: ఈ ముగ్గురు దోషులకు 2011 సెప్టెంబర్ 9న మరణ శిక్షను అమలు చేయాల్సి ఉండగా, మద్రాస్ హైకోర్టు ఆ ఆదేశాలపై స్టే విధించింది. ఇదే నెలలో ఈ ముగ్గురికి విధించిన శిక్షను తగ్గించాలని అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఓ తీర్మానం చేశారు.
2013 ఫిబ్రవరి 24: 1999లో సుప్రీంకోర్టు ధర్మాసనానికి నేతృత్వం వహించిన న్యాయమూర్తి కేటీ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 23 ఏళ్లు వారికి జైలు శిక్ష విధించి.. మళ్లీ మరణ శిక్ష విధించడమంటే.. ఒక్క నేరానికి రెండు శిక్షలు వేసినట్టేనని అన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని స్పష్టం చేశారు.
2013 నవంబర్: సీబీఐ మాజీ ఎస్పీ వీ త్యాగరజాన్ కీలక అంశాలు రివీల్ చేశాడు. టాడా కస్టడీలో పెరరివాలన్ వాంగ్మూలంపై ఆయన వ్యాఖ్యలు చేశాడు. అదొక కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌గా మార్చడానికి ఏజీ పెరరివాలన్ స్టేట్‌మెంట్‌ను కొంత మార్చినట్టు వివరించాడు. తాను కొనుగోలు చేసిన బ్యాటరీని బాంబ్ కోసం వినియోగిస్తారని తనకు తెలుసు అని పెరరివాన్ ఎప్పుడూ చెప్పలేదని తెలిపాడు.
2014 జనవరి 21: ఈ ముగ్గురు దోషుల మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా సుప్రీంకోర్టు కుదించింది.
2015: రాజ్యాంగంలోని 161 అధికరణం కింద తనను విడుదల చేయాలని ఓ మెర్సీ పిటిషన్‌ను పెరరివాలన్ తమిళనాడు గవర్నర్‌కు సమర్పించాడు. గవర్నర్ నుంచి సమాధానం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
2017 ఆగస్టు: 1991లో పెరరివాలన్‌ను అరెస్టు చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఆయనకు తొలిసారి పెరోల్ ఇచ్చింది.
2018 సెప్టెంబర్ 6: తమిళనాడు గవర్నర్ పెరరివాలన్ పిటిషన్‌పై దీర్ఘకాలం జాప్యం వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన పిటిషన్‌పై చర్యలు తీసుకునే హక్కులు గవర్నర్‌కు ఉన్నదని స్పష్టం చేసింది.
2018 సప్టెంబర్ 9: తమిళనాడు అప్పటి సీఎం పళనిస్వామి క్యాబినెట్ అందరినీ (ఏడుగురు) దోషులను విడుదల చేయాలని సిఫారసు చేసింది.
2021 జనవరి: క్యాబినెట్ సిఫారసులపై గవర్నర్ చర్రయలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆగ్రహించింది. లేదంటే గవర్నర్ జాప్యాన్ని పేర్కొంటూ తామే విడుదల చేస్తామని హెచ్చరించింది. రాష్ట్ర క్యాబినెట్ రికమెండేషన్ అయినప్పటికీ గవర్నర్ ఆ ఫైల్‌ను రాష్ట్రపతికి పంపారు.
2021 మే: పెరరివాలన్ పెరోల్‌పై బయటకు వచ్చాడు. డీఎంకే ప్రభుత్వం ఆ పెరోల్‌ను పొడిగించుకుంటూ వస్తున్నది.
2022 మార్చి 9: సుప్రీంకోర్టు పెరరివాలన్‌కు బెయిల్ మంజూరు చేసింది
2022 మే 11: ఈ కేసులో సుప్రీం విచారణ పూర్తి చేసింది.
2022 మే 18: పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు అయిన 31 ఏళ్ల తర్వాత పెరరివాలన్ స్వేచ్ఛను పొందారు.