తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 70వ పుట్టిన రోజు నేడు. డిసెంబర్ 31న సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ బర్త్ డే మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది నట దిగ్గజం రజనీకాంత్ జీవితంలోనే కాదు తమిళనాడు, భారత రాజకీయాల్లోనూ అత్యంత ముఖ్యమైన సందర్భం. 

డిసెంబర్ 12న జన్మించిన రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన రజినీకాంత్ 70యేళ్ల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.  2021 లో తమిళనాడు ఎన్నికలకు ఐదు నెలల ముందు, జనవరిలో తన దీర్ఘకాల రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఇక రజినీ 70 వ పుట్టినరోజు ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉదయమే చెన్నైలోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నాడు. రజనీకాంత్ ఫొటో ఉన్న టీషర్ట్ లు, బ్యానర్లతో సందడి చేశారు.  

వారిలో చాలా మంది, రజినీ అభిమాన సంఘం మక్కల్ మన్రాంకు చెందినవారే ఉన్నారు. ప్రతి యేటా లాగే ఈ రోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇదిలావుండగా, రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఎఐఎడిఎంకె) సమన్వయకర్తగా ఉన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ఒక రోజుముందే  రజనీకాంత్‌కు తమిళంలో ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పన్నీర్ సెల్వం గత వారం రజనీకాంత్ చేసిన తన రాజకీయ అరంగేట్రం ప్రకటనను స్వాగతించారు. కూటమి కోసం కూడా ఆశించారు.

తమిళనాడు రాజకీయాల్లో  AIADMK,  DMK పార్టీలు రెండు ప్రత్యర్థి ధృవాలు. గతవారంగా రజినీ కాంత్ కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. 

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రజీనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు తలైవా అని ఉన్న ఓ పోస్టర్ ను ట్వీట్ చేశాడు.