మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాక్యలు చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని చెప్పారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాక్యలు చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని చెప్పారు. సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ (ఎస్‌పీఎఫ్) రజతోత్సవ వేడుకలకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వెంకయ్య నాయుడుకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్న వెంకయ్య నాయుడును రాజకీయాల నుంచి దూరం చేశారని అన్నారు.
వెంకయ్య నాయుడుకు ఉప రాష్ట్రపతి పదవి దక్కినప్పుడు తాను వ్యక్తిగతంగా కలత చెందానని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి పదవి దేశంలోనే రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అయినప్పటికీ.. ఆ పదవికి తక్కువ అధికారాలు ఉన్నాయని అన్నారు. మచ్చలేని రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న వెంకయ్య నాయుడు వంటి చురుకైన వ్యక్తి.. కేంద్ర మంత్రిగా, రాజకీయాల్లో మరింత చురుగ్గా రాణించాలని తాను కోరుకున్నట్టుగా తన మనసులోని మాటను రజినీకాంత్ బయటపెట్టారు.
ఇదే కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించి ఆయనకు సలహా ఇచ్చినట్టుగా చెప్పారు. ‘‘రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశ్యం గురించి స్నేహితుడి ద్వారా విన్నప్పుడు తాను నటుడిని సంప్రదించాను. నా అభిప్రాయాలు తెలియజేయడానికి రజనీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. నటుడిగా ఆయనను మెచ్చుకున్నప్పటి నుంచి తన అనుభవంతో సలహా ఇచ్చాను. రజనీకాంత్ వినయం, సరళత వంటి లక్షణాలతో కూడిన అసాధారణమైన నటుల అరుదైన తరగతికి చెందినవారు. సాటిలేని సామాజిక నిబద్ధత కలిగి ఉన్నారు’’ అని వెంకయ్య నాయుడు అన్నారు.
‘‘రాజకీయాలు ఆరోగ్యకరం కాదు.. ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదు’’ అని వెంకయ్య నాయుడు అన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చేవారిని తాను నిరుత్సాహపరచడం లేదన్నారు. ఎక్కువ మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, భావజాలానికి నిబద్ధత ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
