తలైవా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 31న పార్టీ ప్రకటించే ఆలోచనలో తలైవా ఉన్నారు. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా సూపర్ స్టార్ తన పార్టీ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా చేయనున్నారని సమాచారం. 

తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేసేందుకు అడుగులేస్తున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఏడు పదుల వయసులో ఉన్న రజనీ ఆరోగ్యం విషయంలో అభిమానుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

అయితే రజనీకాంత్ కోలుకున్నారు..హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి నేరుగా చెన్నై చేరారు. అయితే ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 

ఈ నేపథ్యంలో ఆయన బహిరంగసభలు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాకపోతే ముందుగా నిర్ణయించిన మేరకు పార్టీ ప్రకటన చేయాల్సిందేనని రజనీ భావిస్తున్నారు. 

దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు ‘రజనీ మక్కల్‌ మండ్రం’ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ ప్రారంభోత్సవం మాత్రం ఘనంగా ఉంటుందని, వచ్చే నెలలో దివంగత ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.