మీ స్వార్థ రాజకీయాలకు ప్రజలను బలి చేయొద్దు: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్
Karnataka Bandh: తమిళనాడుకు కావేరి నది జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ.. కన్నడ అనుకూల సంస్థలు, రైతు నాయకులు కర్నాటకలో రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టాయి. ఈ తరుణంలో సీఎం సిద్దిరామయ్య కేంద్రం, బీజేపీ ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంతో ఆ విమర్శలను తిప్పికొడుతూ.. కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు.

Karnataka Bandh: తమిళనాడుకు కావేరి నది జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ.. కన్నడ అనుకూల సంస్థలు, రైతు నాయకులు శుక్రవారం కర్నాటకలో రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్ కు కర్నాటకలోని అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కేంద్ర ప్రభుత్వం, 32 మంది బీజేపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేస్తూ.. ప్రధాని మోడీతో సహా బీజేపీ ఎంపీలపై మండిపడ్డారు. నేడు న్యాయం కోసం కర్ణాటక పోరాడుతోంది. కావేరి సమస్యపై ప్రధాని మోడీ సహా కర్ణాటక కు చెందిన 32 మంది బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. న్యాయం కోసం మన రాష్ట్ర పోరాటం కొనసాగుతోంది. ఈ తరుణంలో మనం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రధాని నిష్క్రియాపరత్వాన్ని సమర్థించడానికే పరిమితమయ్యారా?మన పోరాట గొంతులు వారి చెవిలో పడటం లేదా? మన సమాఖ్య నిర్మాణం ఇదేనా ? అంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు చేసిన ప్రసంగాన్ని వీడియో పోస్టు చేశారు. ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా కేంద్రం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సిద్దిరామయ్య ట్వీట్ ను కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ తీవ్రంగా ఖండించారు. సీఎంను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి రిప్లే ఇచ్చారు. కావేరీ నదీ జలాల వివాదంలో 32 మంది బీజేపీ ఎంపీల (లోక్‌సభ, రాజ్యసభ) తలలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తానని ట్వీట్ చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎదురుదాడికి దిగారు. రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దనీ, కర్ణాటక రైతుల వెన్నుపోటు పొడవద్దని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగు ఇప్పటికే తేలిపోయిందని చెప్పిన రాజీవ్ చంద్రశేఖర్.. మొత్తం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అబద్ధాల మీద ఆధారపడి ఉన్నాయని అన్నారు. మీ ప్రభుత్వ బాధ్యతను ఎంపీలు, భారత ప్రభుత్వంపై వేయాలని భావించడం మీ తెలివైన వ్యూహమని, కానీ అది మీ సందేహాస్పద రాజకీయాలను మరింత బట్టబయలు చేసిందని ఆయన రాశారు. UPA/INDIA కూటమి భాగస్వామి డీఎంకే (DMK) మీ రాజకీయాల ఒత్తిడితో మా రైతు సోదరుల విలువైన నీటిని విడుదల చేసినప్పుడు మీరు ఎవరినీ సంప్రదించలేదని అన్నారు.
ప్రజలు మీ హామీలను నమ్మి.. మీకు ఓటు వేశారనీ, ఇతరులను నిందించడం మానేసి, రైతుల జీవితాలు రక్షించాలని అన్నారు. ప్రజల జీవనోపాధికి, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు , కర్నాటక, బెంగళూరు ప్రజల జీవితాలకు భరోసా కల్పించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి, అవకాశవాద కాంగ్రెస్ రాజకీయాల బలిపీఠం వద్ద కర్ణాటక ప్రజలకు ద్రోహం చేయవద్దనీ, అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమని అన్నారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానేయండి, సమస్యల నుంచి దృష్టి మరల్చడం మానేయండి, రైతుల జీవితాలకు హామీ ఇచ్చేలా వ్యవహరించాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ డిమాండ్ చేశారు.