Rajeev Chandrasekhar: శబరిమల ఆలయంలో జరిగిన బంగారం కుంభ‌కోణం కేసును కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయాల‌ని కేర‌ళ బీజేపీ అధ్య‌క్షుడు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ కేంద్రాన్ని కోరారు. ఈ విష‌య‌మై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయ‌న లేఖ రాశారు. 

శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఇందులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు కేరళ హైకోర్టు సూచించింది. అయితే ఈ కేసును కేంద్ర విచార‌ణ సంస్థ‌లు ద‌ర్యాప్తు చేయాల‌ని కేర‌ళ బీజేపీ అధ్య‌క్షుడు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ కోరారు.

రాజీవ్ చంద్రశేఖర్ తన లేఖలో శబరిమల ఆలయానికి సంబంధించిన గత 30 సంవత్సరాల లావాదేవీలు కూడా పరిశీలించాలంటూ కోరారు. ఇప్పటివరకు బయటపడిన వివరాలు భక్తులను షాక్‌కు గురి చేశాయని ఆయన పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు సమగ్ర విచారణ తప్పనిసరి అని ఆయన అన్నారు.

దేవస్వం బోర్డు పాత్రపై ప్రశ్నలు

శబరిమల స్వర్ణకుంభకోణంపై దేవస్వం బోర్డు అధికారుల పాత్ర, కుట్రలపై కూడా దర్యాప్తు జరపాలని కేరళ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. బోర్డు నిర్ణయాలపై కోర్టు తీవ్ర విమర్శలు చేసింది.

బంగారు పూతలో అవకతవకలు

2019లో శబరిమల దేవుడి ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత వేయించడానికి అప్పగించిన పనిలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగారం పూత వేసినట్లు రికార్డుల్లో చూపినా, వాస్తవానికి తక్కువ నాణ్యత గల పూత వేశారని విచారణలో బయటపడింది. తిరిగి వచ్చిన విగ్రహాల బరువును కూడా నమోదు చేయకపోవడం అనుమానాస్పదమని కోర్టు పేర్కొంది.

దర్యాప్తు విస్తృతం చేయాలని కోర్టు ఆదేశం

దేవస్వం బోర్డు ఉన్నతాధికారులు, అధికారులు, కాంట్రాక్టర్లు అందరి పాత్రను సమగ్రంగా పరిశీలించాలని హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) ఆదేశించింది. అదే విధంగా, బోర్డు సమావేశాల మినిట్స్ బుక్‌ను స్వాధీనం చేసుకుని సంరక్షించాలని కూడా ఆదేశించింది.