పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి ఇకపై జీవిత ఖైదు విధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది.
కాపీయింగ్ మాఫియాకు చెక్ పెడుతూ.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నుంచి పోటీ పరీక్షల్లో పేపర్లు లీక్ చేసిన వారికి ఇకపై యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా కాపీయింగ్ మాఫియాకు గరిష్ట శిక్షగా జీవిత ఖైదు విధించే నిబంధనను జోడించనున్నారు.
ఈ సందర్బంగా సీఎం అశోక్ గహ్లోత్ ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు ఉత్తమ విధానం రూపొందించాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని ఆదేశాలు జారీ చేశాం. పేపర్ లీక్‌లపై నమోదయ్యే కేసుల్లో శిక్షను పెంచేందుకు బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పదేళ్ల శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.
లీకేజీ మాఫియాపై రాజస్థాన్ ప్రభుత్వం గతేడాది కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ యాంటీ కాపీయింగ్ చట్టం ప్రకారం 10 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. కొత్త యాంటీ కాపీయింగ్ చట్టం అమల్లోకి వచ్చినా తరువాత కూడా రాజస్థాన్‌లో నాలుగు పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. పదే పదే పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాపీయింగ్ మాఫియాను అరికట్టేందుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం గురించి సమాచారాన్ని పంచుకున్న తర్వాత రాజస్థాన్ నిరుద్యోగ ఇంటిగ్రేటెడ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేన్ యాదవ్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ధన్యవాదాలు తెలిపారు. పేపర్ లీక్ మాఫియాలకు చట్ట భయం ఉండేలా కఠినంగా శిక్షించాలని తాను చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నానని ఉపేన్ యాదవ్ అన్నారు. కఠిన శిక్షలు విధించడం వల్ల పేపర్ లీక్ మాఫియాలో భయానక వాతావరణం నెలకొంటుందని, దీంతో పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరుద్యోగుల పోరాట విజయంగా ఉపేన్ యాదవ్ అభివర్ణించారు.
