ఇటీవల తెలంగాణలో ఓ యువకుడు పులికి ఆహారమైన సంఘటన విదితమే. తాజాగా.. అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఆహారం కోసం అడవుల నుంచి జనవాసాల్లోకి వస్తున్న పులులు మనుషులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ జిల్లాలోని రణతంబోర్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఓ పులి 40 ఏళ్ల వయసుగల వ్యక్తిపై దాడి చేసి చంపింది. 

పులి దాడిలో మరణించిన వ్యక్తి రణతంబోర్ టైగర్ రిజర్వు పక్కన ఉన్న కనెడి గ్రామానికి చెందిన పప్పు గుర్జర్ గా గుర్తించారు. రణతంబోర్ టైగర్ రిజర్వు పక్కన ఉన్న కనెడి గ్రామశివార్లలో పులి దాడి చేసి ఓ వ్యక్తిని చంపిందని తమకు సమాచారం అందిందని టైగర్ రిజర్వు  ఫీల్డు డైరెక్టరు టికం చంద్ వర్మ చెప్పారు. 

మనిషిని చంపిన పులిని అటవీశాఖ అధికారులు గుర్తించలేదు. పులి దాడి చేసిన ప్రాంతాల్లోని గ్రామస్థులు పులుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పులి దాడిలో మరణించిన పప్పు గుర్జర్ కుటుంబానికి రూ.4లక్షల పరిహారం ఇస్తామని అటవీశాఖ డైరెక్టరు వర్మ చెప్పారు.