Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు కోచింగ్ సెంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌.. పోలీసులు ఏం చెప్పారంటే..?

Kota: కోచింగ్ సెంటర్ల‌కు చెందిన‌ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ఒకరు గతరాత్రి తన గదిలో తెలియని విష పదార్థాన్ని తినగా, మిగిలిన వారు తమ గదుల్లో ఉరివేసుకుని కనిపించారని పోలీసులు తెలిపారు.
 

Rajasthan : Three students of a coaching center committed suicide in Kota
Author
First Published Dec 13, 2022, 1:58 AM IST

Three students die by suicide: కోచింగ్ సెంటర్ల‌కు చెందిన‌ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ఒకరు గతరాత్రి తన గదిలో తెలియని విష పదార్థాన్ని తినగా, మిగిలిన వారు తమ గదుల్లో ఉరివేసుకుని కనిపించారని పోలీసులు తెలిపారు. ఈ విషాదకర ఘ‌ట‌న రాజ‌స్థాన్ లో చోటుచేసుకుంది. దీనిపై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాలో ప్ర‌యివేటు కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లలో చదువుతున్న ముగ్గురు టీనేజర్లు రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. దీంతో మ‌రోసారి దేశంలోని అతిపెద్ద కోచింగ్ హబ్ వార్త‌ల్లో నిలిచింది. ఇక్కడ విద్యార్థులు మెడికల్-ఇంజినీరింగ్‌లో బాగా రాణించాలని ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతుంటారు. ఈ క్ర‌మంలో వారు ఒత్తిడికి గురవుతున్నార‌ని చాలా కాలం నుంచి ఇక్కడి కోచింగ్ సెంట‌ర్ల‌పై ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల గురించి వివ‌రిస్తూ.. ముగ్గురిలో ఇద్దరు విద్యార్థులు బీహార్‌ వాసులు, ప్రముఖ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నారని కోటా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కేశర్‌ సింగ్‌ షెకావత్‌ తెలిపారు. వారు తమ పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. మొదటి వ్యక్తికి 19 ఏళ్లు కాగా, రెండో వ్యక్తికి 18 ఏళ్లు అని తెలిపారు. “ఇద్దరు XI తరగతి విద్యార్థులు. గత ఆరు నెలలుగా ఒకే పీజీ వసతిలోని వేర్వేరు గదులలో ఉన్నారు. వీరిద్దరు స్నేహితులుగా ఉన్నారా లేదా అని ఆరా తీస్తున్నాం. పీజీ హాస్ట‌ల్ యజమాని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి' అని షెకావత్ తెలిపారు.

పీజీ హాస్ట‌ల్ యజమాని ప్రకారం, ఒక అబ్బాయి ఉదయం తన గది నుండి బయటకు రాలేదు. అలాగే, డోర్ ను ఎంత కొట్టినా తెర‌వ‌క‌పోవ‌డంతో త‌లుపులు ప‌గుల కొట్టి చూశారు. అప్ప‌టికే ఆ విద్యార్థి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అలాగే, మధ్యాహ్నం, రెండవ అబ్బాయి సోదరి అతనిని పీజీ వద్ద కలవడానికి వచ్చింది. “అతను మొదటి అబ్బాయి పక్కనే ఉండే గదిలో ఉన్నాడు. అతను తలుపు తెరవకపోవటంతో, అది కూడా పగలగొట్టబడింది. ఆ గ‌దిలో కూడా సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు” అని ఎస్పీ చెప్పారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లు అనుమాన‌స్ప‌దంగా ఉన్నాయ‌నీ, వారి గ‌దుల్లో ఎలాంటి సూసైడ్ నోట్‌లు లభించలేదని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం కోసం వారి మొబైల్‌లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. “ఇద్దరు గత మూడు సంవత్సరాలుగా కోటాలో నివసిస్తున్నారు. వారు బహుశా రాత్రి భోజనం చేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడి వుండ‌వ‌చ్చు. రెండో అబ్బాయి నిన్న రాత్రి తన సోదరికి కూడా ఫోన్ చేశాడు” అని పోలీసులు తెలిపారు. 

మరో ఘటనలో, మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల విద్యార్థి ఏదో విషపూరితమైన పదార్ధం తిని ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు బాలుడు సిద్ధమవుతున్నాడని పోలీసులు తెలిపారు. రెండేళ్లుగా కోటాలో ఉంటూ ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. “నిన్న రాత్రి, అతను PG గ్యాలరీలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. నీటిని నింపడానికి అక్కడికి వచ్చిన మరొక విద్యార్థికి కనిపించాడు. వెంట‌నే హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అత‌ను చనిపోయినట్లు వైద్యులు ప్ర‌క‌టించారు” అని కునాడి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గంగా శర్మ తెలిపారు. ఎటువంటి సూసైడ్ నోట్ కనుగొనబడలేద‌నీ, పోలీసులు గది నుండి ఎలుకల మందుని స్వాధీనం చేసుకున్నార‌ని తెలిపారు. 

కాగా, న‌వంబర్ చివరి వారంలో, ఉత్తరాఖండ్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి కోటలోని ఇంద్ర విహార్‌లోని తన పీజీ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూలైలో, NEETకు సిద్ధ‌మ‌వుతున్న మ‌రో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కోటాలో 2018లో 19 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించే బిల్లును తీసుకురావాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios