సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేసి మోసపోతున్నారంటూ... జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కూడా... కొందరు పట్టించుకోవడం లేదు. తమకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్లి చిక్కుల్లో పడిపోతున్నారు. తాజాగా ఓ యువతి  సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయంతో నగ్నంగా వీడియో చాట్ చేసింది. చివరకు సమస్యలు కొని తెచ్చుకుంది. ఈ సంఘటన రాజస్తాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... రాజస్తాన్ కు చెందిన జితెన్ తన్సుఖానీ అనే యువకుడికి గత నెలలో 24ఏళ్ల యువతితో స్నేహం ఏర్పడింది. తరచూ ఇద్దరూ ఫోన్ లో, ఛాటింగ్ లో మాట్లాడుకునేవారు. కాగా... యువతి రోజూ మాట్లాడుతూ ఉండటాన్ని జితెన్ అదునుగా చేసుకున్నాడు. ఆమె తన మాయలోపడేలా చేసుకున్నాడు. తర్వాత ఓ రోజు యువతికి వీడియో కాల్ చేసి దుస్తులు తీసేయమని కోరాడు.

అతని కోరికను ఆమె కాదనలేక... అతను అడిగినట్లే చేసింది. దీనిని అవకాశంగా చేసుకున్న జితెన్...ఆమె నగ్నంగా ఉన్న సమయంలో వీడియో తీశాడు. ఆ విషయం గమనించని యువతి అతనితో నగ్నంగా మాట్లాడేసింది. తర్వాత జితెన్ ఆమె వీడియోని ఆమె స్నేహితులకు చూపించి రూ.5వేల బేరం ఆడటం మొదలుపెట్టాడు. వెంటనే ఈ విషయాన్ని ఆమె స్నేహితులు యువతికి తెలియజేశారు.

వెంటనే సదరు యువతి ఈ విషయంపై జితెన్ ని నిలదీసింది. అతను నిజం అంగీకరించడంతోపాటు... ఆ వీడియో కావాలంటే రూ.70వేలు కావాలని డిమాండ్ చేయడం గమనార్హం. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే... వీడియో సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించారు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.