అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో విషాదం.. పోలింగ్‌కు ముందు పార్టీ అభ్యర్థి మృతి..
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ తేదీకి కొన్ని రోజుల ముందు ఆ పార్టీ అభ్యర్థి ఒకరు మృతిచెందారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ తేదీకి కొన్ని రోజుల ముందు ఆ పార్టీ అభ్యర్థి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రణ్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుర్మీత్ సింగ్ కూనర్ ఈ తెల్లవారుజామున మరణించారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గుర్మీత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు తరలించారు.
గుర్మీత్ సింగ్ మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు. ‘‘కరణ్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుర్మీత్ సింగ్ కూనర్ మరణ వార్తతో నేను చాలా బాధపడ్డాను. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కూనర్ సాహెబ్ మరణం కాంగ్రెస్ పార్టీకి, రాజస్థాన్ రాజకీయాలకు తీరని లోటు’’ అని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. గుర్మీత్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని గెహ్లాట్ చెప్పారు. ఇదిలాఉంటే, రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అయితే మంగళవారం తెల్లవారుజామున గుర్మీత్ సింగ్ మృతి చెందారనే తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. అయితే గుర్మీత్ సింగ్ కుమారుడు రూబీ కూనర్ ఈ వార్తలను ఖండించారు. గుర్మీత్ సింగ్ మరణ వార్త నిజం కాదని.. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అయితే లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్న ఆయన ఈరోజు(బుధవారం) ఉదయం తుది శ్వాస విడిచారు.