అహ్మదాబాద్: బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కుటుంబ సభ్యులపై అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 

నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూపై, కూతురు ఇందిరా గాంధీపై, ఇతర కటుంబ సభ్యులపై అభ్యంతరకరమైన విషయాలను పోస్టు చేసినట్లు ఆరోపణలు రావడంతో అక్టోబర్ 10వ తేదీన బుండీ పోలీసులు ఆమెపై ఐటి చట్టం కింద కేసు నమోదు చేశారు. 

అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని రాజస్థాన్ పోలీసులు ఇటీవల ఆమెకు నోటీసులు జారీ చేశారు. గూగుల్ నుంచి సేకరించిన సమాచారంతో తాను ఆ పోస్టు పెట్టానని, దానికి పోలీసులు అరెస్టు చేశారని, ఇక్కడ భావప్రకటనా స్వేచ్ఛ ఓ జోక్ గా మారిందని పాయల్ ట్వీట్ చేశారు. 

పాయల్ రోహత్గీని పోలీసులు అహ్మదాబాద్ లోని ఆమె నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెను బుండీకి తీసుకుని వస్తామని ఎస్పీ మమతా గుప్తా చెప్పారు. పాయల్ ముందస్తు బెయిల్ పై సోమవారం కోర్టు విచారణ చేపడుతుంది. తనపై చర్యలు తీసుకోవాలని గాంధీ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ఇటీవల పాయల్ ఆరోపించారు. 

దర్యాప్తునకు పాయల్ సహకరించడం లేదని ఎస్పీ మమతా గుప్తా అన్నారు. పాయల్ చేసిన వ్యాఖ్యలను జత చేస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి, బుండీ నివాసి చర్మేష్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.