ఒకవైపు స్వచ్ఛభారత్ కోసం దేశ ప్రజలంతా కృషి చేయాలంటూ ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిస్తుంటే.. మరో వైపు ఆయన పార్టీకి చెందిన ఓ నేత దానిని ఏమాత్రం ఖాతరు చేయకుండా పాడుపని చేశారు. రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శంభు సింగ్ ఖేటసర్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఆ సదరు మంత్రిగారు తమ ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్‌ పక్కనే  మూత్ర విసర్జన చేయడం విశేషం. తను చేసిన ఈ పనిని  ఇది పెద్దవారి సాంప్రదాయమని సమర్ధించుకోవడం మరో విశేషం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ భారీ బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో శంభు సింగ్‌ బహిరంగ మూత్ర విసర్జన చేశారు.

దీనిపై మీడియా వివరణ కోరగా.. తను తమ సీఎం పోస్టర్‌ పక్కన మూత్ర విసర్జన చేయలదని, ఓ గోడపక్కన చేశానని, అక్కడ ఎలాంటి పోస్టర్‌ లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్‌ భారత్‌ ఉద్దేశం బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని చెప్పుకొచ్చారు. మల,మూత్ర విసర్జనలు రెండు వేర్వేరన్నారు. బహిరంగ మల విసర్జన వల్ల వ్యాధులొస్తాయని, కానీ మూత్ర విసర్జన వల్ల ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. తను ఈ పని చేసిన చోటు  చాలా విశాల ప్రాంతమని, అక్కడ జనవాసం లేకపోవడంతో అసలు సమస్యే ఉండదని ఈ రాజస్తాన్‌ మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దగ్గరల్లో ఎక్కడా  టాయిలెట్స్‌ లేవన్నారు.