కుటుంబం కోసం ఓ వ్యక్తి త్యాగం చేశాడు. తాను చనిపోయినా.... తన కుటుంబం ఆనందంగా ఉంటుందని భ్రమపడ్డాడు. అందుకోసం తన హత్యకు తానే పథకం వేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్ లోని భిల్వారాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భిల్వారాకు చెందిన బల్వీర్ కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.20లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు ఎలా తీర్చాలో అతనికి అర్థం కాలేదు. రోజు రోజుకీ అప్పుల్లోళ్ల బాధ ఎక్కువైపోతోంది. ఈ కారణంగా తన కుటుంబసభ్యులు ఇబ్బంది పడటం చూడలేకపోయాడు. దీంతో... రూ.50లక్షలకు ప్రమాద బీమా చేయించుకున్నాడు. అందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు.

తాను ప్రమాదంలో  చనిపోతే ఆ సొమ్ము తన కుటుంబసభ్యులకు వస్తుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే తనను తాను హత్య చేయించుకోవడానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన సునీల్ యాదవ్ ను సంప్రదించాడు. అతడికి రూ.80వేలు చెల్లించాడు. కాగా... ప్లాన్ ఫ్రకారం సునీల్ మరో వ్యక్తి రజ్వీర్ సహాయంతో బల్వీర్ ని హత్య చేశాడు. అయితే... అక్కడే కథ అడ్డం తిరిగింది. డబ్బు రాకపోగా... హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టుతో బల్వీర్ వేసిన ప్లాన్ బయటపడింది.