అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో జరిగే రామ మందిర నిర్మాణంలో పింక్ స్టోన్ వినియోగాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.

రాజస్థాన్ గనుల శాఖ, భరత్ పూర్ జిల్లా అధికారులు, పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రామాలయం పేరు చెప్పి కొందరు ఈ పింక్ స్టోన్‌ను అక్రమంగా తవ్వుతున్నారని అధికారులు గుర్తించారు. బన్షీపహార్‌ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తేల్చారు.

అయితే మైనింగ్‌కు సంబంధించి ఎవరికి అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుండగా దాదాపు 20 ట్రక్కుల పింక్ స్టోన్‌ను అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఆ అంశాన్ని గెహ్లాట్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

సాధారణంగా ఆలయ నిర్మాణాల్లో పింక్  స్టోన్ వాడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ప్రతిష్టాత్మక రామ మందిర నిర్మాణంలో ఉపయోగిస్తామని చెప్పి అక్రమాలకు పాల్పడటం మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గత నెల 5న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.