రాజస్థాన్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జైసల్మేర్ లోని ఓ పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ మహిళ 5నెలల చంటిబిడ్డను ఒడిలో ఎత్తుకుని విధులు నిర్వహిస్తోంది. 

ఒక వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు పేగుబంధాన్ని భుజాలపై మోస్తున్న ఆ తల్లిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. పసిబిడ్డ ఏడుస్తున్నా ఆమె అక్కడే ఉండి  ఆడిస్తుంది. అయితే చంటి బిడ్డ తల్లులను ఇలాంటి ఎన్నికల్లో ఎందుకు డ్యూటీ వేస్తారో అని గుసగుసలు ఆడుకుంటున్నారు. పసిబిడ్డ ఆకలితో ఏడిస్తే ఆ ఉద్యోగి ఎక్కడకు వెళ్లి పాలు ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఒక వేళ పక్కకు వెళ్తే డ్యూటీ చెయ్యడం లేదని అధికారుల ఆగ్రహంతో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని విమర్శిస్తున్నారు ఓటర్లు. అయితే ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఐదునెలల చంటి బిడ్డను భుజాలపై ఎత్తుకుని రెండు బాధ్యతలు చూస్తున్న ఆ తల్లికి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఒకవైపు తల్లిగా బిడ్డపై ఉన్న మమకారం, మరోవైపు చిత్తశుద్ధితో డ్యూటీ చెయ్యడంతో అందరి నోటా వావ్ గ్రేట్ అనిపించుకుంటుంది.