Asianet News TeluguAsianet News Telugu

Rajasthan Election 2023: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  నేడే .. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే.. 

Rajasthan Election 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడే జరుగనుంది. రాజస్థాన్‌లో 200 నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 51 వేల 756 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు.

Rajasthan Election 2023 The voting across 199 of the 200 constituency assemblies KRJ
Author
First Published Nov 25, 2023, 6:59 AM IST

Rajasthan Election 2023: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  నేడే జరుగనుంది. రాజస్థాన్‌లో అధికారాన్ని ఎవరు చేజిక్కించుకోనున్నారో మరికాసేపట్లో ఈవీఎంలో నిక్షిప్తం కాబోతుంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రత్యక్ష పోటీ నెలకొంది. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 199 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 199 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,25,38,105 మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాజస్థాన్‌లో మొత్తం 1862 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 5,25,38,105 ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో 18-30 ఏళ్ల మధ్య 1,70,99,334 మంది ఓటర్లు ఉండగా, వారిలో 22,61,008 మంది 18-19 ఏళ్లలోపు కొత్త ఓటర్లు ఉన్నారు.

199 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. శ్రీగంగానగర్‌లోని కరణ్‌పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కునార్ మృతి చెందడంతో ఈ ప్రాంతంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

రాష్ట్రంలో మొత్తం 36,101 చోట్ల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌ గుప్తా తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 10,501, గ్రామీణ ప్రాంతాల్లో 41,006 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 26,393 పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ జరుగుతుందని, ఈ పోలింగ్‌ కేంద్రాలను జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 6287 మంది మైక్రో అబ్జర్వర్లు, 6247 మంది రిజర్వ్ సెక్టార్ అధికారులు పోలింగ్ పార్టీలకు తోడుగా ఉండే వారిని నియమించారు.నిరంతర సమన్వయాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఏ రకమైన సమస్యనైనా వెంటనే పరిష్కరించబడుతుంది.

రాజస్థాన్‌లో శాంతియుతంగా ఓటింగ్‌ జరిగేందుకు 1,02,290 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. మొత్తం 69,114 మంది పోలీసులు, 32,876 మంది రాజస్థాన్ హోంగార్డు, ఫారెస్ట్ గార్డ్, ఆర్‌ఏసీ సిబ్బందిని మోహరించారు. కాగా, 700 కంపెనీల CAPFని మోహరించారు.

 బరిలో నిలిచిన ప్రముఖులు

కాంగ్రెస్ వైపు నుంచి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, శాంతి ధరివాల్, బీడీ కల్లా, భన్వర్ సింగ్ భాటి, సలేహ్ మహ్మద్, మమతా భూపేశ్, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, రాజేంద్ర యాదవ్, శకుంతలా రావత్, ఉదయ్ లాల్ అంజన, మహేంద్రజిత్ సింగ్ మాల్వియా, అశోక్ చందనా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తో సహా పలువురు నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇక బిజెపి నుండి ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్, ప్రతిపక్ష ఉపనేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఎంపీ దియా కుమారి, రాజ్యవర్ధన్ రాథోడ్, బాబా బాలక్‌నాథ్ మరియు కిరోరి లాల్ మీనా, గుర్జార్ నాయకుడు దివంగత కిరోరీ సింగ్ కుమారుడు విజయ్ బైన్స్లా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3 న వెలువడనున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios