Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ సంక్షోభం : ఢిల్లీకి కేసీ వేణుగోపాల్ ను పంపిన రాహుల్.. ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా చర్చించాలని సూచన

రాజస్థాన్ సంక్షోభం కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది. దీంతో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గీయుల మధ్య రాజీ చేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుంది. దీనికోసం కేసీ వేణుగోపాల్ ను రాహుల్ ఢిల్లీకి పంపించారు. 

Rajasthan crisis: Rahul Gandhi sent KC Venugopal to Delhi
Author
First Published Sep 26, 2022, 12:19 PM IST

న్యూఢిల్లీ : రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది. అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే పార్టీ పరిశీలకునిగా వెళ్లిన మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ వారితో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. అయితే, అశోక్ గెహ్లాట్ వర్గీయులు పైలెట్ కు సీఎం పదవి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిసాయి. దీంతో ఖర్గే,  అజయ్ మాకెన్ తిరిగి ఢిల్లీకి పయనం అవుతున్నారు.

మరోవైపు రాజస్థాన్లో ఏర్పడ్డ అనూహ్య పరిణామాలను రాహుల్ గాంధీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. ఎమ్మెల్యేల రాజీనామా విషయం తెలియగానే హుటాహుటిన కేసీ వేణుగోపాల్ ను ఢిల్లీకి పంపారు. ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అసమ్మతి వర్గంలోని ఒక్కో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పరిశీలకులు ప్రత్యేకంగా చర్చించాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. అయితే ఎమ్మెల్యేలంతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ ఇళ్లకు వెళ్లారని ఇవ్వాళ ఎవరితోనూ భేటీ అయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ పార్టీకి షాక్.. 82 మంది ఎమ్మెల్యేల రాజీనామా.. త‌న చేతిలో ఏమీ లేద‌న్న అశోక్ గెహ్లాట్

మరోవైపు ఇవాళ సాయంత్రం సోనియాగాంధీతో కాంగ్రెస్ పరిశీలకులు కేసి వేణుగోపాల్ సమావేశం అవుతారని ఆ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గెహ్లాట్ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానంలో సచిన్ పైలెట్ ను కొత్త సీఎంగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే గెహ్లాట్ వర్గం దీన్నితీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తమ వర్గానికి చెందిన వారినే సీఎం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభానికి దారితీసింది.

బిజెపి సెటైర్లు..
ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ యాత్రలో పాల్గొంటుంటే.. మరోవైపు రాజస్థాన్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చోడో అంటున్నారని బిజెపి సెటైర్లు వేసింది. దేశాన్ని ఏకం చేయడం కాదు రాహుల్, ముందు మీ ఎమ్మెల్యేలను ఏకం చేయి అని ఎద్దేవా చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios