నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తాజాగా మరో ఎత్తుగడ వేశారు. ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు
రాజస్థాన్ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పూటకో మలుపు తిరుగుతూ.. తలలు పండిన రాజకీయ నాయకులకు సైతం టెన్షన్ పెట్టిస్తోంది. నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తాజాగా మరో ఎత్తుగడ వేశారు.
ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నియంత్రణ, పరీక్షలు, సహా వివిధ అంశాలపై చర్చించాలని అజెండాలో వివరించారు. కానీ బలపరీక్ష అంశం అజెండాలో మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై గవర్నర్ తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.
అయితే గవర్నర్‌కు సమర్పించిన లేఖ బలపరీక్ష అంశం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు.
Also Read:టార్గెట్ మహారాష్ట్ర అసాధ్యం...బిజెపికి దమ్ముంటే మా జోలికి రావాలి: సీఎం ఉద్దవ్ సవాల్
అనంతరం అజెండాను తయారు చేసి గవర్నర్‌కు అందజేశారు. వ్యూహాత్మకంగానే సీఎం గెహ్లాట్ ఈ కొత్త ఎత్తుగడ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు గవర్నర్ కల్‌రాజ్‌మిశ్రాతో భేటీ అయిన గెహ్లాత్ ఫోర్త్ టెస్ట్‌కు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే గవర్నర్ ఎంతకీ స్పందించకపోవడంతో శుక్రవారం రాజ్‌భవన్ ముందు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామని ఓ కాంగ్రెస్ నేత వెల్లడించారు.
