రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. సచిన్ పైలట్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

పార్టీ పరంగా పక్కనపెట్టడమే కాక... సీఎం అశోక్ గెహ్లాత్ నుంచి తన మాజీ సహచరుడు వేధింపులు ఎదుర్కోవడం చూస్తుంటే బాధగా ఉందన్నారు. ప్రతిభకీ, సామర్ధ్యానికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లేదని పేర్కొన్నారు.

కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జ్యోతిరాదిత్య సింథియా ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన వర్గంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయింది.

Also Read:రాజస్థాన్ కాంగ్రెస్‌లో సచిన్ కలకలం: ఎమ్మెల్యేలతో ఢిల్లీకి పైలెట్

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సుధీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింథియానే కారణం. కానీ కాంగ్రెస్ హైకమాండ్ వీరిని కాదని.. సీనియర్లకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడంతో ఈ యువ నాయకత్వంలో అసంతృప్తి రాజుకుంది.

ఈ నేపథ్యంలో సింథియా కాంగ్రెస్‌ను వీడగా.. ప్రస్తుతం సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. సచిన్ పైలట్ కొంతమంది శాసనసభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లడం కలకలం రేపింది.

సీఎం గెహ్లాత్ తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ సచిన్ ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నట్లుగానే రాజస్థాన్‌లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.