జైపూర్:ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్టులతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజంట్ సహా నలుగురు తీవ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా నిఘా వర్గాలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రంలోని తీరం వెంట ఇండియాలోకి ప్రవేశించినట్టుగా  ఐబీ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

ఈ నెల మొదటి వారంలోనే తీవ్రవాదులు దేశంలోకి చొరబడినట్టుగా ఐబీ వర్గాలు చెబుతున్నాయి.ఆ నలుగురూ ఏ విషయంలో విధ్వంసకర చర్యలకు తెగబడే అవకాశం ఉందని  నిఘా వర్గాలు ప్రకటించాయి. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలపై తీవ్రవాదులు దృష్టి పెట్టారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు ఐబీ దుండగుల ఊహ చిత్రాలను పంపింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనే దాడులకు పాల్పడాలని దుండగులు ప్లాన్ చేశారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. హోటల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సహా రద్దీగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని నిఘా వర్గాలు ఆదేశించాయి.