ఉదయ్‌పూర్‌ టైలర్ కన్హయ్య లాల్ హంతకులలో ఒకడైన రియాజ్ అట్టారీ బీజేపీ సభ్యుడని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ వీటిని తిప్పికొట్టింది. ఆ హంతకులతో తమకు సంబంధాల్లేవని స్పష్టం చేసింది. 

జైపూర్: మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థించి దారుణ హత్యకు గురైన ఉదయ్‌పూర్ టైలర్‌ ఘటనపై తాజాగా మరో వివాదం రేగింది. ఉదయ్‌పూర్ టైలర్ హంతకులలో ఒకరితో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో బీజేపీ వివరణ ఇచ్చింది. ఉదయ్‌పూర్ టైలర్ హంతకులతో తమకు ఏం సంబంధం లేదని రాజస్తాన్ బీజేపీ యూనిట్ స్పష్టం చేసింది..

ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్య చేసిన వారిలో ఒకడు బీజేపీ సభ్యుడేనని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు బదిలీ చేసిందా? అని పేర్కొంది. తద్వారా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నదా? అని ఆరోపణలు సంధించింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా ఓ మీడియా సంస్థ క్లిప్‌లను పేర్కొంటూ ట్విట్టర్‌లోనూ పోస్టులు చేశారు. అయితే, స్వయంగా ఆ మీడియాా సంస్థనే తాము అలాంటి కథనం ప్రచురించలేదని, కాబట్టి, ఆ వ్యాఖ్యలను తమకు ఆపాదించవద్దని కోరింది. 

ఉదయ్‌పూర్ టైలర్ హంతకుల్లో ఒకడైన రియాజ్ అట్టారీ.. బీజేపీ సభ్యుడు అని ఆరోపించింది. ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హంతకుల్లో ఒకడైన రియాజ్ అట్టారీ బీజేపీ మెంబర్ అని పేర్కొనగా.. ఇతర కాంగ్రెస్ నేతలూ ఆయన దారిలో నడిచారు.

ఈ వాదనలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా కొట్టిపారేశారు. అవి ఫేక్ న్యూస్ అని తోసిపుచ్చారు.

పవన్ ఖేరా హంతకుడు అట్టారీ, బీజేపీ నేతలు ఇర్షద్ చైన్వాలా, మొహమ్మద్ తాహిర్‌లతో కలిసి ఉన్న ఫొటోను ప్రస్తావించారు. అంతేకాదు, రాజస్తాన్ బీజేపీ నేతలు, మాజీ మంత్రి గులాబ్ చంద్ కటారియాలతో తరుచూ కార్యక్రమాలకు హాజరయ్యేవాడని ముందుకు వచ్చిందని తెలిపారు. అంతేకాదు, ప్రధాన నిందితుడు రియాజ్ అట్టారీ రాజస్తాన్ బీజేపీ మైనార్టీ యూనిట్ సభ్యులతో సమావేశమైన ఫొటోలు ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చాయని పవన్ ఖేరా పేర్కొన్నారు.

బీజేపీ నేత ఇర్షద్ చైన్వాలా, మొహమ్మద్ తాహిర్‌ల ఫేస్‌బుక్ పోస్టులను చూస్తే అట్టారీ కేవలం బీజేపీ నేతలకు సన్నిహితుడని మాత్రమే కాదు.. బీజేపీలో క్రియా శీలక సభ్యుడని కూడా తెలుస్తుందని పవన్ ఖేరా ఆరోపించారు.