ఇప్పటి వరకు ఐదుగురిని చంపేశాం.. లాలవండి, బెహ్రోర్‌ కానివ్వండి.. అంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెహ్లూ ఖాన్, రక్బార్ ఖాన్ హత్యలను ఆయన ప్రస్తావించారు. మూకదాడులకు ఆయన ప్రేరేపిస్తున్నట్టుగా వ్యాఖ్యలు ఉన్నాయి.

జైపూర్: రాజస్తాన్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూకదాడులకు ప్రేరేపిస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాదు, గతంలో జరిగిన మూక దాడులను తామే చేశామని బాహాటంగా చెప్పడం ఇప్పుడు చర్చనీయంశం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆయన తన వ్యాఖ్యల్లో పెహ్లూ ఖాన్, రక్బార్ ఖాన్‌ల హత్యలను ప్రస్తావించారు. ఈ రెండు ఘటనలు 2017, 2018లలో జరిగాయి. ఇవి రెండు కూడా రామ్‌గడ్ ఏరియాలో చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో అక్కడి ఎమ్మెల్యేగా జ్ఞాన్ దేవ్ అహుజానే ఉన్నారు.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా మాట్లాడుతూ, ‘చంపడానికి నేను మా కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. ఆ తర్వాత మేం వారిని కేసు నుంచి బయటకు తెస్తాం. బెయిల్ వచ్చేలా చేస్తాం’ ఇప్పటి వరకు తాము ఐదుగురిని చంపేశామని వెల్లడించారు. లాలవండి, బెహ్రోర్‌లలో కానివ్వండి.. మేం ఐదుగురిని చంపేశాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాల్లో పెహ్లూ ఖాన్, రక్బార్ ఖాన్‌ల హత్యలు జరిగాయి.

Scroll to load tweet…

పెహ్లూ ఖాన్ హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారు. 2019లో వీరు నిర్దోషులుగా బయటపడ్డారు. రక్బార్ ఖాన్ మర్డర్ కేసుకు సంబంధించి స్థానిక కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్నది.

జ్ఞాన్ దేవ్ అహుజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై కేసు నమోదైంది. మతపరమైన హింసను రెచ్చగొడుతున్నారనే అభియోగాలతో ఐపీసీలోని 153ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ అహుజా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ హంతకులను ఆయన దాదాపు దేశభక్తులని అన్నారు. అంతేకాదు, ఛత్రపతి శివాజీ, గురుగోబింద్ సింగ్‌లకు సిసలైన వారసులని కితాబిచ్చారు.

కాగా, బీజేపీ అల్వార్ యూనిట్ మాత్రం అహుజా చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు సదరు నేత సొంత అభిప్రాయాలు అని వివరించింది. పార్టీ ఇలా ఆలోచించదని బీజేపీ సౌత్ అల్వార్ చీఫ్ సంజయ్ సింగ్ నరుకా స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, అహుజా మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గోవుల అక్రమ తరలింపు, గోవధ చేసే వారిని వదిలిపెట్టబోమని అన్నారు. అయితే, తన వ్యాఖ్యలను కొంచెం మార్పు చేస్తూ ‘గోవులను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు మియో ముస్లింలను తమ కార్యకర్తలు దొరకబట్టి కొట్టారని చెప్పాను’ అని వివరించారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ అసలు రూపం బయటపడిందని, బీజేపీ ఒక మతపరమైన తీవ్రవాద, ఉన్మాదాన్ని తెలుపడానికి ఇంకా ఏం రుజువు కావాలని రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతసారా ట్వీట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. బీజేపీ నిజమైన రూపాన్ని ఇది బట్టబయలు చేస్తున్నదని తెలిపారు.