కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవేవీ ఫలించకపోవడంతో చివరి అస్త్రంగా లాక్ డౌన్ కే ఓటు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించగా, తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది.

రాజస్థాన్ లో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 10 నుంచి 24 వరకు కఠిన లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న ఈ 14 రోజుల్లో పెళ్లిళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలు, ఉపాధి హామీ పథకాలు కూడా ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఈ నెల 31 తరువాత మాత్రమే వివాహాలకు అనుమతిస్తామని పేర్కొంది. పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ తదితర వాటి కోసం ఇచ్చిన అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేయడమో, లేదంటే తర్వాత సర్దుబాటు చేసుకోవడమో చేయాలని ప్రభుత్వం సూచించింది. 

అయితే కేవలం 11 మందితో ఇళ్లళ్లోనూ, ఇండోర్ కోర్టుల్లోనూ పెళ్లిళ్లు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి నిచ్చింది. 

కరోనా విశ్వరూపం: మే 8 నుండి కేరళలో లాక్‌డౌన్...

కాగా, కేరళ కూడా రేపటినుండి ఏడు రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 8 నుండి 14 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  విజయన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. బుధవారం నాడు ఒక్క రోజులోనే  కేరళ 41,953 కరోనా కేసులు రికార్డయ్యాయి.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona