దేవీనవరాత్రులు ముగిసాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని నిష్టగా పూజించి నిమజ్జన ఏర్పాట్లు చేశారు. అయితే... ఈ నిమజ్జన ప్రక్రియలో అపశృతి చోటుచేసుకుంది. దుర్గా మాతను నీటిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో నీటిలో పడి 7గురు మృతి చెందగా పలువురు  గల్లంతయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు.సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వారు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. గల్లంతైనవారిలో  ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై ధోల్ పూర్ కలెక్టర్ స్పందించారు. అక్టోబర్ 08వ తేదీ మంగళవారం రాత్రి దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వచ్చారని, ప్రమాదవశాత్తు 10 మంది నీటిలో మునిగిపోయారన్నారు. సమాచారం తెలిసిన వెంటనే వారికోసం గాలింపు చేపట్టామని, కానీ రాత్రి కావడంతో సెర్చ్ ఆపరేషన్లు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి బుధవారం గాలింపులు కొనసాగించామన్నారు.

కాగా.. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష సహాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అమ్మవారిని నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒకరు స్నానానికి నదిలో దిగారని.. అతను కొట్టుకుపోవడంతో కాపాడటానికి నదిలోకి దిగి మిగిలినవారు కూడా ప్రమాదంలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు.