రాజస్తాన్ మంత్రి రాజేంద్ర గూడ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఓ వ్యక్తికి ఓటు వేస్తే రూ. 25 కోట్లు ఇస్తామనే ఆఫర్ వచ్చిందని, కానీ, ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానని చెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు సందర్భంలోనూ రూ. 60 కోట్ల ఆఫర్ రాగా.. తృణీకరించానని వివరించారు. 

జైపూర్: రాజస్తాన్ మంత్రి రాజేంద్ర గూడ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓ వ్యక్తికి ఓటు వేస్తే రూ. 25 కోట్లు ఇస్తామని తనకు ఓ ఆఫర్ వచ్చిందని చెప్పారు. కానీ, తాను ఆ ఆఫర్‌ను తృణీకరించారని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లోనే కాదు.. 2020లో సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలోనూ భాగస్వాములు కావాలని, అలా చేస్తే రూ. 60 కోట్లు అందిస్తామని కొందరు ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ తాను ఆ ఆఫర్‌ను స్వీకరించలేదని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ తనకు డబ్బులు ఆఫర్ చేసిన వారి పేర్లను వెల్లడించలేదు.

రాజస్తాన్ సైనిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర గూడ సోమవారం జున్‌‌జున్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఆ సమావేశానికి సంబంధించి ఓ వీడియో సోసల్ మీడియాలో వచ్చింది.

ఓ విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర మంత్రి మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికలో ప్రత్యేకంగా ఓ వ్యక్తికి ఓటు వేయడానికి రూ. 25 కోట్లు ఇచ్చే ఓ ఆఫర్ వచ్చిందని వివరించారు. కానీ, ఈ ఆఫర్ గురించి తన భార్యతో మాట్లాడానని తెలిపారు. కానీ, మంచి మనసు ఉండాలని తన భార్య చెప్పడంతో ఆ ఆఫర్‌ను నిరాకరించానని చెప్పారు.

అలాగే, అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ సారథ్యంలో జరిగిన తిరుగుబాటులోనూ తనకు రూ. 60 కోట్ల ఆఫర్ వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తాను తన కుటుంబం, తన భార్యతో మాట్లాడానని పేర్కొన్నారు. వారంతా తమకు డబ్బు కంటే మంచి మనసు, మంచి ఆలోచనలు ఉండాలని సూచించారని, దీంతో ఆ ఆఫర్‌నూ తిరస్కరించినట్టు చెప్పారు. అలాంటి వారు మీతో ఉంటే అంతా మంచే జరుగుతుందని తెలిపారు.