రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తానని ప్రకటించి సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ మరో ముందడుగు వేశారు. హఠాత్తుగా కీలక నేతలతో మంతనాలు జరిపారు. రజనీ నివాసం వద్ద పోలీసు భద్రత పెరుగుతోంది. దీంతో రాజకీయవర్గాలు, అభిమానుల్లో ఏం జరగబోతోందో అనే టెన్షన్ మొదలయ్యింది. 

అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనలు, పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బుధవారం మక్కల్‌ మండ్రం నేతలతో సమావేశమయ్యారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో ఆకస్మికంగా సమావేశం ఏర్పాటైంది. రజనీకి ప్రత్యేక సలహదారులు అర్జున్‌మూర్తి, తమిళురివి మణియన్‌  సమావేశంలో పాల్గొన్నారు. 

నవంబర్‌ 30న రజనీకాంత్‌ రాష్ట్రవ్యాప్తంగా రజనీ మక్కల్‌ మండ్రం జిల్లా శాఖ నేతలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ నెల 3న రజనీకాంత్‌ హఠాత్తుగా తన ట్విట్టర్‌ పేజీలో రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు.  ఆ తర్వాత పోయెస్‌గార్డెన్‌ నివాసగృహం వద్ద మీడియాతో మాట్లాడుతూ... వచ్చే యేడాది జనవరిలో పార్టీ పెడతానని, ఆ వివరాలను డిసెంబర్‌ 31న ప్రకటిస్తానని పేర్కొన్నారు.  

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హఠాత్తుగామక్కల్‌ మండ్రం నేతలందరికీ రజనీ ఫోన్‌ చేసి బుధవారం రాఘవేంద్ర కల్యాణమండపంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. దీంతో బుధవారం ఉదయం మక్కల్‌ మండ్రం నేతలంతా చెన్నైకి చేరుకున్నారు. రాఘవేంద్ర కల్యాణ మండపంలో గతంలోలా ఎలాంటి పోలీసుభద్రతా ఏర్పాట్లు లేకుండా మీడియాను దూరంగా ఉంచి రజనీ కాంత్‌ మండ్రం నేతలతో సమావేశమై చర్చించారు.

డిసెంబర్‌ 31న పార్టీ ప్రారంభ ప్రకటన చేయాల్సి ఉందని, మదురై లేదా తిరుచ్చి నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అభిమానుల సమక్షంలో ప్రకటిస్తే బాగుంటుందా అని అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 14 నుంచి తాను ‘అన్నాత్తే’ షూటింగ్‌కు హైదరాబాద్‌ వెళ్లి  నెలాఖరుకు చెన్నై తిరిగి వస్తానని రజనీ చెప్పారు. ఆ పరిస్థితుల్లో పార్టీ ప్రకటన సభకు భారీ ఏర్పాట్లు చేపట్టేందుకు మక్కల్‌ మండ్రం నేతలు రంగంలోకి దిగాలని రజనీ  కోరారు. ఇక పార్టీకి ఏ పేరు పెట్టాలి? ఏ గుర్తును ఎంపిక చేసుకోవాలి? అనే విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న రజనీకాంత్‌ నివాసం వద్ద బుధవారం పోలీసుల బందోబస్తు ఏర్పాటైంది.