నాసిక్‌లోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై వున్న టోల్‌ప్లాజాను ఎంఎన్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రాజ్ థాక్రే కుమారుడు, ఎంఎన్ఎస్ నేత అమిత్ థాక్రేను అడ్డుకోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. 

రాజ్ ధాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నివ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వివాదంలో చిక్కుకుంది. నాసిక్‌లోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై వున్న టోల్‌ప్లాజాను ఎంఎన్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రాజ్ థాక్రే కుమారుడు, ఎంఎన్ఎస్ నేత అమిత్ థాక్రేను అడ్డుకోవడంతో శనివారం ఆయన అర్ధగంట సేపు సిన్నార్ టోల్‌ప్లాజా వద్ద వేచి వుండాల్సి వచ్చింది. దీనిపై భగ్గుమన్న రాజ్ థాక్రే కార్యకర్తలు టోల్ బూత్‌పై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అమిత్ థాక్రే ఎంఎన్ఎస్ కార్యకర్తలు, నేతలతో కలిసి శనివారం సాయంత్రం భారీ కాన్వాయ్‌తో అహ్మద్ నగర్ నుంచి సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే మీదుగా సిన్నార్‌కు తిరిగి వస్తున్నారు. అయితే టోల్‌ప్లాజా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులు చూపించాలని అడిగినందుకు గాను ఎంఎన్ఎస్ కార్యకర్తలు, నేతలు టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలుగా చెబుతున్న గుంపు టోల్‌ప్లాజాను ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా తమకు క్షమాపణలు చెప్పాలని సిబ్బందిని బెదిరించారు.

టోల్ ఉద్యోగులు తమ నేత వేచి వుంచేలా చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడు కార్లలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. టోల్ సిబ్బంది కూడా ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరిస్తోందని పోలీసులు తెలిపారు.