ఆల్వార్: పురాణ పురుషుడు, శ్రీరాముని భక్తుడు అయిన హనుమంతుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురొచ్చిన జై హనుమాన్ అంటూ స్మరించుకుంటూ విజయం సాధిస్తారు. 

అలాంటి హనుమంతుడికి కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేస్తూ దైవత్వానికే భంగం కలిగేలా చేస్తున్నారు పలువురు రాజకీయ నేతలు. అన్ని వర్గాల ప్రజలు కొలిచే హనుమంతుడిని ఏదో ఒక కులానికే పరిమితం చేసేలా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయంటూ ఆయన భక్తులు ఆరోపిస్తున్నారు.

తాజాగా హనుమంతుడికి కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు చెయ్యడంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాబ్ బబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ తో పెట్టుకోవద్దని హితవు పలికారు. ప్రజలు నిత్యం ఆరాధించే హనుమంతుడిని రాజకీయాల్లోకి లాగడం వల్లే బీజేపీ మూడు రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆరోపించారు. 

హనుమంతుడు కులంపై రచ్చ చేసింది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అని చెప్పాలి. ఇటీవలే హనుమంతుడు దళితుడు అంటూ ప్రకటించడంతో ఆయనది ఏ కులం అంటూ చర్చ మెుదలైంది. హనుమంతుడిది ఆ కులం ఈ కులం అంటూ ఆపాదించేస్తున్నారు. 

 అంతేకాదు కుల, మతాలను ఆపాదించేందుకు సైతం పోటీ పడ్డారు. క్రికెటర్ చేతన్ చౌహన్ ఏకంగా హనుమంతుడిని మల్లయోధుడని ప్రకటించగా, యూపీ మంత్రి లక్ష్మీనారాయణ ఆయనను ఓ జాట్‌గా అభివర్ణించారు. 

ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ అయితే ఏకంగా హనుమంతుడి కులాన్నే కాదు మతాన్ని సైతం మార్చేశారు. హనుమంతుడిని ముస్లింగా పేర్కొన్నారు. తాను హనుమంతుడిని ముస్లిం అని నమ్ముతున్నట్లు ఓ జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ సైతం ఇచ్చేశారు. అందుకే ముస్లింలు ఆయన పేరు వచ్చేలా రెహమాన్, జీషన్, షర్మాన్, కుర్బాన్ వంటి పేర్లు పెట్టుకుంటారని ఉదహరించారు.  

వీరు సరిపోరన్నట్లు ఓ జైనమత ప్రబోధకుడు హనుమంతుడు జైన మతానికి చెందిన వాడని వ్యాఖ్యానించారు. ఇకపోతే ప్రగతీశీల సమాజ్ వాదీ పార్టీ అధినేత శివపాల్ యాదవ్ అయితే ఓ అడుగు ముందుకు వేసి హనుమంతుడి కులాన్ని ధృవీకరిస్తూ సర్టిఫికెట్ జారీ చెయ్యాలని వారణాసి జిల్లా కలెక్టరేట్ లో దరఖాస్తు కూడా చేసేశారు. 

మరోవైపు జాతీయ షెడ్యూల్డ్ తెగల  కమిషన్ చైర్మన్ నందకుమార్ అయితే హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడు అంటూ ప్రకటించి మరో వివాదానికి తెరలేపారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు హనుమంతుడికి, కులాన్ని మతాన్ని ఆపాదించడంతో చిర్రెత్తుకొచ్చిన కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ ఆగ్రహంతో రగిలిపోయారు. 

హనుమంతుడిని చిక్కుల్లో పెట్టొద్దంటూ హితవు పలికారు. హనుమాన్ తోక దెబ్బకు బీజేపీ ఇప్పటికే మూడు ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ లంక తగలబడుతోందంటూ చురకలు వేశారు. ఇప్పటికైనా బీజేపీ ఇలాంటి రాద్ధాంతాలు మానుకోవాలని రాజ్ బబ్బర్ హితవు పలికారు. 
 
 అందరి తప్పులను మన్నించే గుణం, అందరిని ఆదుకునే దైవత్వం ఉన్న హనుమంతుడికి ఇలాంటి పరిస్థితి రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తనకు ఎన్ని కులాలు, మతాలు అంటగడితే మాత్రం హనుమంతుడు ఏం చేస్తాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.