కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ బబ్బర్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. పడిపోతున్న రూపాయి విలువను మోదీ తల్లితో పోల్చిచెప్పారు.

ఇంతకీ మ్యాటరేంటంటే..ఇటీవల భోపాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన రాజ్ బబ్బర్.. కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శలు కురిపించారు. ‘‘ మోదీ పడిపోతున్న రూపాయి విలువను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వయసుతో పోల్చారు. కానీ ఈ రోజు రూపాయి విలువ మోదీ అమ్మగారి వయసంత పడిపోయింది’’ అంటూ కామెంట్స్ చేశారు.

అనంతరం ఆయోధ్య రామ మందిర నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. ‘ఆలయ నిర్మాణానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇప్పుడు ముస్లింలు కూడా రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఆలయాన్ని నిర్మిస్తానంటుంది కానీ ఎప్పుడనేది చెప్పడం లేదు’ అంటూ ఆరోపించారు. అయితే రాజ్‌ బబ్బర్‌ మాటలపై బీజేపీ మండి పడుతుంది.

వెంటనే రాజ్ బబ్బర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నీచ మనస్తత్వానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.