దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగింది. ఇటీవలే దానిని సడలించగా.. ప్రజలు ఊపరిపీల్చుకున్నారు. అయితే.. సడలింపుల తర్వాత కరోనా కేసులు మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారంటూ వార్తలు వచ్చాయి.

అయితే.. ఈ వార్తలపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఇక దేశంలో లాక్ డౌన్ ఉండదని చెప్పారు. అయితే... లాక్ డౌన్ లేనప్పటికీ.. ప్రజా రవాణ మొదలవ్వడానికి మాత్రం చాలా సమయం పట్టేలా ఉంది.  ఇప్పటికే మూడు నెలలకు పైగా రైళ్లు పట్టాలెక్కలేదు. ఆ మధ్య వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లు తిరిగాయి. తర్వాత మళ్లీ రైళ్లు తిరిగింది లేదు.

లాక్ డౌన్ సడలిస్తున్నారు కాబట్టి.. త్వరలోనే రైళ్లు పట్టాలెక్కుతాయని అందరూ భావించారు. అయితే... ఈ విషయంలో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వీసుల రద్దును ఆగస్టును 12 వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వే బోర్డు గురువారం కీలక ప్రకటన చేసింది.

వైరస వ్యాప్తి నానిటికీ పెరుగుతోన్న నేపథ్యంలో జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, మెయిల్ సర్వీసులు, ప్యాసింజరు రైళ్లు, సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తున్నట్టు గురువారం వెల్లడించింది. కాగా, లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేసింది.

అంతేకాదు.. కొందరు ఇప్పటికే రైళ్ల టికెట్ల బుక్ చేసుకోగా.. వారు చేసుకున్న టికెట్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. కాగా.. టికెట్ బుక్ చేసుకున్న వారిందరికీ తిరిగి డబ్బులు చెల్లిస్తామని స్పష్గం చేశారు.