పట్టాలపై నిలిచిన రైలు: తోసిన రైల్వే ఉద్యోగులు, వీడియో వైరల్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమెథీలో రైల్వే ఉద్యోగులు రైలును తోసుకుంటున్న వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమెథీలో శుక్రవారంనాడు పట్టాలపై ఆగిన రైలును తోశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఇన్స్ పెక్టర్ ఆర్ఎస్ శర్మ స్పందించారు. నిహల్ ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే అధికారులు తనిఖీ కోసం ఉపయోగించే డీపీసీ రైలు చెడిపోయిందన్నారు. పట్టాలపై నిలిచిన రైలును ఉద్యోగులు మెయిన్ పట్టాల నుండి లూప్ లైన్ పట్టాల వరకు తోసుకుంటూ తీసుకెళ్లారని ఆయన వివరించారు. రైల్వే ఉద్యోగులు రైలును నెడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ రైలుకు మరమ్మత్తులు చేసిన తర్వాత తిరిగి గమ్యస్థానానికి చేర్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వేశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే గత మాసంలో మహారాష్ట్రలో రైలు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయిన ఓ వ్యక్తిని కాపాడేందుకు ప్రయాణీకులు రైలును తోశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.