Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఆర్ బి ఎగ్జామ్ : వేడినీటిపై చేయిపెట్టి బొటనవేలి చర్మం కత్తిరించి.. స్నేహితుడి చేతికి అతికించి.. చివరికి...

రైల్వే ఉద్యోగం కోసం ఓ యువకుడు హైటెక్ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డాడు. తన బదులు తన స్నేహితుడితో ఎగ్జామ్ రాయించేందుకు అతను చేసిన పని అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. 
 

Railway Job Aspirant Peels Off Thumb Skin, Pastes On Friend's Hand in Gujarat
Author
First Published Aug 26, 2022, 7:17 AM IST

గుజరాత్ : పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఏం చేస్తారు? బాగా చదువుతారు.. అంతేకదా.. అయితే కొంతమంది మాత్రం అడ్డదారుల్లో పాసవ్వాలని కోరుకుంటారు. పోటీ పరీక్షలకు వచ్చేసరికి ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు హాల్ టికెట్ల మీద ఫోటో మార్చి వేరే వ్యక్తితో పరీక్ష రాయించడం.. హైటెక్ రీతిలో టెక్నాలజీ సహాయంతో మాస్ కాపీయింగ్ చేయిండం లాంటి ఘటనలు చాలా విన్నాం.. అయితే గుజరాత్ లో ఓ యువకుడు వీటన్నింటికీ.. మించి ఆలోచించాడు. సినిమాల నుంచి స్ఫూర్తి పొందాడో.. లేక వెబ్ సిరీస్ లనుంచి ఆలోచించాడో తెలీదు కానీ.. బొటనవేలి ముద్రలు మార్చి స్నేహితుడితో పరీక్ష రాయించాలనుకుని అడ్డంగా బుక్కయ్యాడు.

పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు అందరు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తుంటే.. కొంతమంది మాత్రం అక్రమ మార్గాల ద్వారా ఉద్యోగం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇలాంటి ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగం సాధించేందుకు గుజరాత్ కు చెందిన ఓ అభ్యర్థి చేసిన పనికి షాక్ కు గురి చేస్తోంది. తన ప్లేస్ లో స్నేహితుడితో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించాడు. దీనికోసం ఏకంగా తన బొటనవేలు చర్మాన్ని కత్తిరించి  మిత్రుడి చేతికి అంటించాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, పరీక్ష హాల్ లో బయోమెట్రిక్ తీసుకునే సమయంలో మిత్రుడు వేలికి అంటించిన చర్మం కాస్తా ఊడిపోవడంతో యువకుడు మోసం బట్టబయలైంది.

ఆహారం వడ్డింపు విషయంలో గొడవ.. భార్య ప్రాణాలు తీసిన భ‌ర్త

భారతీయ రైల్వేలో గ్రూప్-డి నియామక పరీక్ష ఇటీవల జరిగింది. ఇందులో భాగంగా వడోదరాలో చెందిన మనీష్ కుమార్ అనే ఓ 20 ఏళ్ల విద్యార్థి తన స్నేహితుడు గుప్తాతో పరీక్ష రాయించాలి అనుకున్నాడు. అయితే, అక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందని తెలుసుకున్న యువకుడు.. తన బొటనవేలు చర్మానికి కత్తిరించి స్నేహితుడు చేతికి అంటించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వేడి పాత్ర మీద చెయ్యిపెట్టి పొక్కుగా వచ్చిన చర్మాన్ని బ్లేడ్ సహాయంతో కత్తిరించి స్నేహితుడి బొటనవేలికి అంటించాడు.

అయితే పరీక్ష జరుగుతున్న సమయంలో బయోమెట్రిక్ ధ్రువీకరణ కోసం వచ్చిన నిర్వాహకులు పలుసార్లు ప్రయత్నించినప్పటికీ థంబ్ ఇంప్రెషన్ పడలేదు. అదే సమయంలో సదరు అభ్యర్థి అనుమానాస్పదంగా చేతులను దాచుకునే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు.. యువకుడు చేతులపై శానిటైజర్ వేసి శుభ్రం చేసుకోవాలని సూచించాడు.  దాంతో చేతికి అతికించిన వేలిముద్రల చర్మం ఊడిపోవడంతో విద్యార్థి మోసపూరిత కుట్ర వెలుగులోకి వచ్చింది. అసలు మోసం గ్రహించిన పరీక్షల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అభ్యర్థిని విచారించిన పోలీసులు మనీష్ కుమార్ తో పాటు అతడి స్థానంలో పరీక్షకు హాజరైన రాజ్యగురుగుప్తా(22)ను అరెస్టు చేశారు. వారిపై ఫోర్జరీ, చీటింగ్,  నేరపూరిత కుట్రవంటి అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఏసీపీ ఎస్ఎం మనోటారియా వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios