హైదరాబాద్: పండగ సీజన్ సందర్భంగా సొంత ప్రాంతాలను వెళ్ళాలనుకునే వారు రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల మధ్య ఇంకా బస్సు సర్వీసులు ప్రారంభంకాలేదు. అయితే దసరా, దీపావళి సందర్భంగా సొంతూళ్లకు ప్రయాణమవుతున్న వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 

పండగల సీజన్ సందర్భంగా దేశవ్యాప్తంగా 392 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.  సోమవారం నుండి నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఈ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

 అలాగే ఇదే పండగ సీజన్లో ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయమొకటి తీసుకుంది రైల్వే శాఖ. ప్రయాణ ఛార్జీలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైలు ఛార్జీల పెంపు నిర్ణయంపై ఇప్పటికే ప్రచారం జరుగుతుండటంతో రైల్వేశాఖ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలని... రైలు ఛార్జీలను పెంచే యోచన లేదని రైల్వే శాఖ ప్రకటించింది. 

ప్రస్తుతం పండగ సీజన్ తో పాటు వేసవి సెలవుల సమయంలో  నడిపే ప్రత్యేక రైళ్లకు సాధారణంగా నడిచే రైళ్లలో ఛార్జీలు వేరువేరుగా వుంటాయని తెలిపారు. ఈ విషయం తెలియక రైలు ఛార్జీలను పెంచినట్లు ప్రచారం చేస్తున్నారని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.