Asianet News TeluguAsianet News Telugu

ట్రెయిన్ గార్డులు ఇక నుంచి ట్రెయిన్ మేనేజర్లు.. పోస్టు గుర్తింపును సవరించిన రైల్వే శాఖ

రైల్వే శాఖ ట్రైన్ గార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తమ పోస్టు పేరును ట్రైన్ గార్డు నుంచి ట్రైన్ మేనేజర్‌గా మార్చాలని కొంత కాలంగా వారి నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ వారి పోస్టును ట్రైన్ గార్డు నుంచి ట్రైన్ మేనేజర్‌గా మార్చింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే, ఈ మార్పుతో వారి జీత భత్యాల్లో వచ్చే మార్పేమీ ఉండదని స్పష్టం చేసింది. ఇది కేవలం వారి పోస్టు పేరు మార్చడమేనని వివరించింది.
 

railway board redesignated train guard as train manager
Author
New Delhi, First Published Jan 15, 2022, 4:50 AM IST

న్యూఢిల్లీ: రైల్వే శాఖ(Railway Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. ‘గార్డు’(Train Guard)ల పోస్టు గుర్తింపును సవరించింది. ఇక పై గార్డులను ట్రైన్ మేనేజర్లు(Train Manager)గా వ్యవహరించనుంది. కొంత కాలంగా ఈ పోస్టు పేరు మార్పు(Redesignation) గురించిన డిమాండ్ వినిపిస్తున్నది. రైల్వే శాఖ బోర్డు సమావేశాల్లోనూ కొంతకాలంగా ఈ పోస్టు డెసిగ్నేషన్‌ను మార్చడంపై చర్చ జరిగినట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ చర్చల్లోనే గార్డు పోస్టు డెసిగ్నేషన్‌ను ట్రైన్ మేనేజర్‌గా మార్చడానికి నిర్ణయం తీసుకున్నట్టు వివరిచింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. 

ప్రస్తుతం గార్డుల బాధ్యతలు, విధులకు తగినట్టుగా పోస్టు డెసిగ్నేషన్‌ను మార్చినట్టు రైల్వే శాఖ ట్వీట్ చేసింది. ఈ మార్పు వారి బాధ్యతలకు తగినట్టుగా ఉన్నదని వివరించింది. ఈ మార్పు వారిలో కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది. గార్డు అనే హోదా ఇప్పుడు కాలం చెల్లిందని, బయట ఎవరైనా గార్డు అంటే.. ఏదో ప్రైవేటు సంస్థలో గార్డుగా చేస్తున్నారేమోననే అభిప్రాయం వస్తుందని సీనియర్ అధికారులు వివరించారు. కానీ, జనరల్ అండ్ సబ్సిడరీ రూల్స్ ప్రకారం, ట్రైన్ గార్డు అంటే.. ట్రైన్ ఇంచార్జీ అని అర్థం అవుతుందని తెలిపారు.

ప్రస్తుతం మార్పులతో అసిస్టెంట్ గార్డును ఇక నుంచి అసిస్టెంట్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్‌గా, గూడ్స్ గార్డ్‌ను గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా వ్యవహరించాలి. సీనియర్ ప్యాసింజర్స్ గార్డ్‌ను సీనియర్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్‌గా మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గార్డ్‌ను మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఈ మార్పునకు సంబంధించి ఈ నెల 13వ తేదీతో రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటన ప్రకారం, గార్డు పోస్టులను ఇక నుంచి ట్రైన్ మేనేజర్‌గా గుర్తించే నిర్ణయాన్ని రైల్వే బోర్డు తీసుకున్నట్టు తెలిపింది. ఇది కేవలం.. ఆ పోస్టు గుర్తింపును మార్చడం మాత్రమేనని స్పష్టం చేసింది. అంతేకానీ, వారి జీతభత్యాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని వివరించింది. ప్రస్తుతం వ్యవహరిస్తున్న ట్రైన్ గార్డును ట్రైన్ మేనేజర్‌గా మార్చడం సముచితమని మరికొందరు సీనయిర్ రైల్వే శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. తద్వార వారు సొసైటీలోనూ ఒక హోదాను పొందగలరని వివరించారు. కాగా, కొందరు నిపుణులు మాత్రం ఈ నిర్ణయాన్ని రైల్వేను కార్పొరేటీకరణ చేస్తున్న ప్రక్రియలో భాగమేనని అభిప్రాయపడ్డారు. ఈ పోస్టు పేరును మార్చడం ద్వారా ప్రయాణికులు వచ్చేదేమీ లేదని వారు పేర్కొన్నారు. రైల్వేను కార్పొరేటీకరణ చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేయడమే ఈ పోస్టు పేరు మార్పు అని వివరించారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు రైల్వేశాఖ (indian railways) శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి (sankranthi) పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలుసర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (south central railway) తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios