న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆహ్వానంపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. జమ్ముకశ్మీర్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. 

జమ్ముకశ్మీర్ లో ప్రశాంతమైన వాతావరణం ఉందని రాహుల్ గాంధీ వచ్చి కళ్లారా చూడాలంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు తాను ప్రత్యేక విమానం సైతం పంపిస్తున్నానని రాహుల్ వచ్చి కశ్మీర్ పరిస్థితి చూడాలంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. 

గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆహ్మానంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గ‌వ‌ర్న‌ర్ మాలిక్ వ్యాఖ్య‌ల‌కు  రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్ మాలిక్ ఆహ్వానాన్ని స్వాగ‌తిస్తున్నట్లు ట్వీట్ చేశారు.  త్వరలోనే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో క‌లిసి జమ్ముక‌శ్మీర్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు రాహుల్ స్పష్టం చేశారు. 

త‌మ‌కు విమానం అవ‌స‌రం లేద‌ని, కానీ క‌శ్మీర్‌లో స్వేచ్ఛ‌గా తిరిగే ప‌రిస్థితుల‌ను క‌ల్పించాల‌ని రాహుల్ గాంధీ కోరారు. స్థానిక ప్ర‌జ‌ల‌ను, ముఖ్య నేత‌ల‌ను, సైనికుల‌ను క‌లుసుకుంటామ‌ని రాహుల్ గవర్నర్ సత్యమాలిక్ కు తెలిపారు.  

ఇకపోతే జమ్ముక‌శ్మీర్‌లో ఆర్టికల్ 370,ఆర్టికల్ 35 ఏ రద్దు నేపథ్యంలో ఆ ప్రాంతాలలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయని, ప్రధాని మోదీ శాంతియుత చర్యలు చేపట్టాలని రాహుల్ కోరారు.  

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్ సత్యమాలిక్ స్పందించారు. రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ కు రావాలని తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి పరిస్థితిని కళ్లారా చూసేందుకు ఆయన కోసం విమానం పంపిస్తానని ఆఫర్ చేశారు. గవర్నర్ ఆహ్వానాన్ని స్వాగతించిన రాహుల్ గాంధీ విమానాన్ని మాత్రం తిర‌స్క‌రించారు.