కర్ణాటక సీఎం రేసులో సిద్దరామయ్య ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సిద్దరామయ్యకే మద్దతు తెలిపినట్టు సమాచారం. మెజార్టీ ఎమ్మెల్యేలూ సిద్దరామయ్య వైపే ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌కు మరో టఫ్ ఫైట్ ఎదురైంది. సీఎం పీఠం కోసం ఇద్దరు కీలక నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. కర్ణాటక విజయంలో ఇద్దరిదీ కీలక పాత్ర. ఈ తరుణంలో ఎవరి వైపు మొగ్గాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతున్నది. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ హైకమాండ్‌తో చర్చల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలు కీలక విషయాన్ని అందించాయి. కర్ణాటక సీఎం రేసులో రాహుల్ గాంధీ సిద్దరామయ్యకే ఓటేసినట్టు ఆ వర్గాలు ఇండియా టుడేకు తెలిపాయి.
కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్‌లు ఇద్దరూ సిద్దరామయ్యకు మద్దతు తెలుపుతున్నట్టు తెలిసింది. మెజార్టీ ఎమ్మెల్యేలూ సిద్దరామయ్యకే సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో సీఎం రేసులో డీకే శివకుమార్ కంటే సిద్దరామయ్య ఒక అడుగు ముందంజలో ఉన్నట్టు అర్థమవుతున్నది.
అయితే, కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ సోనియా గాంధీతో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. మంచి ఈక్వెషన్ ఉన్నది. అందుకే తుది నిర్ణయం వెలువడే వరకు ఈ ఉత్కంఠ ఇలాగే సాగేలా కనిపిస్తున్నది.
Also Read: పీసీసీ చీఫ్ పదవికి రాజీనామాపై తేల్చేసిన డీకే శివకుమార్
ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఎవరి వైపునకూ మొగ్గు చూపడం లేదు. నిర్ణయం తీసుకోవడానికి ముంద ఇరువరితో సంప్రదింపులు జరిపారు. నిజానికి కర్ణాటక సీఎం పోస్టు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయాన్ని పార్టీ మల్లికార్జున్ ఖర్గే చేతిలోనే పెట్టింది.
కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇంచార్జీ, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రణదీప్ సుర్జేవాలా ఈ విషయంలో తటస్థంగా ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. కర్ణాటక సీఎం గురించిన ప్రకటన విషయమై మంగళవారం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమావేశమయ్యారు.
ఇంతలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీకి వచ్చారు. సిద్దరామయ్య సోమవారం సాయంత్రమే ఢిల్లీకి వచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు వేర్వేరుగా భేటీ అవుతున్నారు.
