యోగి ఆధిత్యనాథ్ మరోసారి కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకల మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాశనానికి ఈ అన్నాచెల్లెళ్లిద్దరూ చాలు వేరెవరూ అక్కర్లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లక్నో : Congress పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు Rahul gandhi, Priyanka gandhi, చాలునని వేరొకరెవరూ అక్కర్లేదని Uttarpradesh ముఖ్యమంత్రి, బీజేపీ నేత Yogi Adityanath అన్నారు ‘బేకార్’ కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని ఉత్తరాఖండ్ ప్రజలను తాను కోరానని చెప్పారు. ఆయన సోమవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం పంజాబ్ లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తో తనకు విభేదాలు ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను రాహుల్ గాంధీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని.. అదేవిధంగా ఆయన కూడా తన కోసం త్యాగం చేస్తారని చెప్పారు తమ మధ్య విభేదాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో సోమవారం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి అన్నాచెల్లెలు ఇద్దరు చాలునని, వేరొకరెవరూ అక్కర లేదని అన్నారు. ‘బేకార్’ కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని, ఆ పార్టీకి వేసిన ఓట్లు వృధా అవుతాయని ఉత్తరాఖండ్ ప్రజలకు చెప్పానన్నారు.
హిజాబ్ వివాదం గురించి మాట్లాడుతూ పాఠశాలల్లో సరైన డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. గజ్వా-ఏ-హింద్ కోసం వారు కంటున్న కలలు ఖయామత్ వరకు నెరవేరవని చెప్పారు. ఇది నవభారత మని ప్రపంచంలో గొప్ప ప్రజాదరణ గల నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న భారతదేశం అని చెప్పారు. నవభారతం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందని.. షరియా ప్రకారం కాదని వివరించారు. ఈ నవ భారతం లో అందరికీ అభివృద్ధి అందుతుందని, ఎవరినీ బుజ్జగించేది లేదని తెలిపారు. అందరితో కలిసి, అందరి అభివృద్ధి అనే నినాదంతో.. అందరి నమ్మకం, అందరి కృషితో తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ప్రాథమిక హక్కులు, నమ్మకాలను దేశంపైనా వ్యవస్థల పైనా రుద్దలేమని చెప్పారు. కాషాయం ధరించాలని ఉత్తరప్రదేశ్ ప్రజలను, కార్యకర్తలను అడిగానా? అని ప్రశ్నించారు. తమకు నచ్చిన దాన్ని ప్రజలు ధరిస్తారన్నారు. కానీ పాఠశాలల్లో మాత్రం డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. ఇది పాఠశాలలు, వాటిలో క్రమశిక్షణలకు సంబంధించిన విషయం అని చెప్పారు. వ్యక్తిగత నమ్మకాలు వేరని.. వ్యవస్థల విషయానికి వచ్చేసరికి వాటిలోని నియమ, నిబంధనలను అంగీకరించాలని చెప్పారు. దేశం విషయానికి వచ్చేసరికి రాజ్యాంగాన్ని పాటించాలన్నారు.
హిజాబ్ ధరించిన మహిళా దేశానికి ప్రధానమంత్రి అవుతుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై యోగి స్పందిస్తూ... ప్రతి బాలిక, భారత దేశ బిడ్డ హక్కులు, స్వాతంత్య్రం కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్రిపుల్ తలాక్ కు పుల్స్టాప్ పెట్టారని చెప్పారు. బాలికలకు న్యాయం చేయడం, వారిని గౌరవించడం, వారిని సాధికారులుగా తీర్చ దిద్దడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. షరియా ప్రకారం వ్యవస్థ నడవదని, కేవలం రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుస్తోందని, వ్యవస్థలో రాజ్యాంగం అమలైతే ప్రతి బాలికకు రక్షణ, గౌరవం లభిస్తాయని తెలిపారు. ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధిస్తుంది అని చెప్పారు.
