'ఇండియా మౌనంగా ఉండదు..'
మణిపూర్‌లో పరిస్థితిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ .. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటే.. ఇండియా మౌనంగా ఉండదని అన్నారు.

మణిపూర్ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో పాటు ఈశాన్య రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న హింసాకాండపై రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..ఈ అంశంపై ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఇలా వ్రాశారు- ప్రధానమంత్రి మౌనం.. నిష్క్రియాత్మకత మణిపూర్‌ను అరాచకం వైపు నెట్టింది. మణిపూర్‌లో చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇండియా మౌనంగా ఉండదు. మణిపూర్ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి ఒక్కటే ముందున్న మార్గం. మణిపూర్‌లో కుల హింస ఇప్పుడు 'అరాచకం'గా మారింది. మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేయడం దారుణమని పేర్కొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార BJP నేతృత్వంలోని NDAని ఐక్యంగా ఎదుర్కోవడానికి ఇరవై ఆరు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం - ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) - ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాయి.
గత రెండున్నర నెలలుగా మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతునే ఉంది. ఇంటర్నెట్ స్తంభించిపోయి జనజీవనం స్తంభించిపోయింది. అదే సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చిన వీడియోలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి, ఉన్మాదమైన గుంపు మొత్తం గ్రామాన్ని ఊరేగించారని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ట్వీట్ చేశారు. సమాచారం ప్రకారం.. ఆ ఇద్దరూ మహిళలు కుకీ కమ్యూనిటీకి చెందిన వారు. ఈ ఘటన తర్వాత మహిళలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హతమార్చినట్టు తెలుస్తోంది.
ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే మణిపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ట్వీట్‌లో తెలిపారు. ఈ ఘటన తౌబాల్ జిల్లాలోని నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్ పరిధిలో మే 4, 2023న చోటుచేసుకుందనీ, మహిళలను గుర్తుతెలియని సాయుధ దుండగులు నగ్నంగా ఊరేగించారనీ, వారిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య మొదలైన వాటిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా వీడియోపై స్పందిస్తూ.. మణిపూర్ నుండి వెలువడుతున్న మహిళలపై లైంగిక హింస చిత్రాలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయని అన్నారు. మహిళలపై జరిగిన ఈ దారుణమైన హింసాకాండను ఎంత ఖండించినా సరిపోదని పేర్కొంది. మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం మనమంతా ఒకే గొంతుతో ఖండించాలని ప్రియాంక గాంధీ అన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఎప్పుడూ స్పందించారు? ఆ హింసాత్మక ఘటనలు వారిని కలవరపెట్టడంలేదా? ప్రశ్నించారు.