మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనల మధ్య కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. జూన్ 29న ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని దుయ్యబట్టింది కాంగ్రెస్ పార్టీ. మే 3న గిరిజన సంఘీభావ ర్యాలీ తర్వాత మణిపూర్‌లో హింస మొదలైంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ హింసాకాండలో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారు.
మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనల మధ్య కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. జూన్ 29-30 తేదీల్లో రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మంగళవారం (జూన్ 27) ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ఇంఫాల్, చురచంద్‌పూర్‌లోని సహాయ శిబిరాలను సందర్శించి, పౌర సమాజ ప్రతినిధులతో సంభాషించనున్నారు.
దాదాపు రెండు నెలలుగా మణిపూర్ మండుతున్నదని, సంఘర్షణల నుంచి శాంతి వైపు సమాజం పయనించేలా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ అన్నారు. ఇది మానవ విషాదం , ద్వేషం కాకుండా ప్రేమగా ఉండటం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్నాయి. మణిపూర్ హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మణిపూర్‌పై ప్రధాని మోడీ మాట్లాడటం లేదనీ, దేశం మొత్తం ఎదురు చూస్తోందని , ముందుగా ముఖ్యమంత్రి ఎన్‌బీరెన్‌సింగ్‌ను తన పదవి నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్‌లోని అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఉమ్మడి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రధాని మోదీని లక్ష్యంగా
మణిపూర్‌పై ఎట్టకేలకు హోంమంత్రి (అమిత్ షా) ప్రధాని మోదీతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయని మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. గత 55 రోజులుగా మణిపూర్‌పై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోదీజీ నిజంగా మణిపూర్ గురించి ఏమైనా ఆలోచిస్తే.. ముందుగా మీ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి. తీవ్రవాద సంస్థలు, సంఘ వ్యతిరేక వ్యక్తుల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకోండి. అన్ని పార్టీలతో చర్చలు ప్రారంభించి ఉమ్మడి రాజకీయ మార్గాన్ని కనుగొనండి. అని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఓ వైపు ఈశాన్య రాష్ట్రాలు మండిపోతున్నాయని, మరోవైపు ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని, హోంమంత్రి అమిత్ షా ఏమీ చేయడం లేదని ఆరోపించారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడానికి, సయోధ్య ప్రక్రియను ప్రారంభించే ప్రయత్నంలో బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవిలో ఒక్క నిమిషం కూడా వృధా అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
100 మందికి పైగా
మే 3న గిరిజన సంఘీభావ ర్యాలీ తర్వాత మణిపూర్‌లో హింస మొదలైంది. ఈ రాష్ట్రంలో మెయిటీ,కుకీ వర్గాల మధ్య చెలరేగిన జాతి హింసలో 100 మందికి పైగా మరణించారు. మణిపూర్‌లో షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రుల ఇళ్లను కూడా కాల్చివేశారు.
