Sidhu Moose Wala: ఇటీవల హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామాన్ని సందర్శించనున్నారు.
Sidhu Moose Wala: ఇటీవల హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామాన్ని సందర్శించనున్నారు. పలు మీడియా కథనాల ప్రకారం..రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధూ ముసేవాలా స్వగ్రామమైన మాన్సాలోని మూసాకు చేరుకుంటారు. సిద్ధూ కుటుంబ సభ్యులను కలుసుకుని.. పరిస్థితిని తెలుసుకోనున్నారు.
ఈ సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వ శాంతిభద్రతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. సిద్ధూ హత్యకు ఒకరోజు ముందు మే 28న పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలో సిద్దూతో సహా 424 మంది భద్రతాను తగ్గించింది.
ఆ మరుసటి రోజే.. సిద్ధూ ముసేవాలాను టార్గెట్ చేస్తూ.. దుండగులు పట్టపగలే తుపాకులతో దాడి చేసి హతమార్చారు. సిద్ధూ ముసేవాలాను మే 29న పంజాబ్‌లో పట్టపగలు కాల్చి చంపారు. ఈ దాడిలో సిద్ధూ ముసేవాలపై ఒకటి రెండు కాదు ఏకంగా 19 రౌండ్లు కాల్పులు జరిపారు.
సిద్దూ వాలా కుటుంబాన్ని రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సోమవారం నాడు కలిసి పరమర్శించారు. ఈ హత్యపై విచారం వ్యక్తం చేస్తూ హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘మా నాయకుడిని హత్య చేయడం బాధాకరం.. రాష్ట్రంలో బెదిరింపు వాతావరణం సృష్టిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసులో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. అలాగే.. డ్రగ్ మాఫియాలు, ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు పంజాబ్‌లో పట్టుబడుతున్నారు. వీటిపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. దోషులపై చర్య తీసుకోవాలి" అని పైలట్ డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నేతలు హన్స్ రాజ్ హన్స్, మంజీందర్ సింగ్ సిర్సా కూడా సిద్దూ మృతికి సంతాపం తెలిపేందుకు మూస్ వాలా కుటుంబాన్ని కలిశారు.
అంతకుముందు.. సిద్ధూ ముసేవాలా కుటుంబం తన కుమారుడి హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమయంలో సిద్ధు ముసేవాలా తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. అదే సమయంలో అమిత్ షా కూడా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికలకు ముందు సిద్ధూ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేశారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సింగ్లాకు మొత్తం 1 లక్షా 23 వేల ఓట్లు పోందగా.. సిద్ధూ ముసేవాలా కేవలం 36,700 గెలుచుకోగలిగారు. ఈ ఎన్నికల్లో 63 వేల 323 ఓట్ల తేడాతో ఓడిపోయారు.