Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లోని ససారాం నుంచి 16 రోజుల పాటు, 1,300 కి.మీ.ల ‘ఓటర్ అధికార్ యాత్ర’**ను ఆదివారం ప్రారంభించనున్నారు. 20 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగియనుంది.
Rahul Gandhi Voter Adhikar Yatra: బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటు దోపిడీ ("ఓటు చోరీ) ఆరోపణలతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)"ఓటర్ అధికార్ యాత్ర" (Voter Adhikar Yatra)ను ఆగస్టు 18 నుంచి ప్రారంభించబోతున్నారు. ఆదివారం సాసారాం నగరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 16 రోజుల పాటు, 1,300 కి.మీ. దూరం, 20 జిల్లాల మీదుగా కొనసాగతుంది. ప్రజాస్వామ్య హక్కు అయిన "ఒక వ్యక్తి – ఒక ఓటు"ను రక్షించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం అని కాంగ్రెస్ ప్రకటించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ససారాంలోని బీహార్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (BIADA) గ్రౌండ్ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు RJD నేత తేజస్వి యాదవ్, మహాఘట్బంధన్‌లోని ఇతర పార్టీ నాయకులు పాల్గొననున్నారు. 16 రోజుల పాటు జరిగే ఈ మార్చ్ సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ర్యాలీతో ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బీహార్‌లో జరుగుతున్న "ఓటు చోరీ"పై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఈ యాత్ర ద్వారా సంకేతాలు ఇస్తోంది.
‘లాపతా ఓటు’ వీడియో విడుదల
ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త పంథాలో ముందుకు వచ్చారు. ‘లాపతా ఓటు’ పేరుతో వీడియోను శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేస్తూ, ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా ప్రజలంతా కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం నుండి ఆయన బీహార్‌లోని ససారాం నుంచి 16 రోజులపాటు, 1,300 కి.మీ. పొడవున 20 జిల్లాల గుండా ‘ఓటర్ అధికార్ యాత్ర’కొనసాగతుంది. ఓటరు అధికార్ యాత్రతో మేము ప్రజల మధ్యకు వస్తున్నాము. ఇది అత్యంత ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు 'ఒక వ్యక్తి, ఒక ఓటు'ను రక్షించడానికి పోరాటం. రాజ్యాంగాన్ని కాపాడటానికి మాతో చేరండి అని పిలుపునిచ్చారు.
రూట్ మ్యాప్..
ససారాంలోని BIADA గ్రౌండ్స్ వద్ద జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మహాఘట్బంధన్‌లోని ఇతర పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఈ యాత్ర ఔరంగాబాద్, గయా, నవాడా, నలంద, షేక్‌పురా, లఖిసరాయ్, ముంగేర్, భాగల్‌పూర్, కతిహార్, పూర్నియా, అరారియా, సుపాల్, మధుబని, దర్భంగా, సీతామర్హి, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, గోపాలగంజ్, అవాన్‌గంజ్ తదితర జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది.
బీజేపీపై పవన్ ఖేరా ఫైర్
దేశంలో ఓటర్ల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో, కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగ అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పేరుతో లక్షలాది మంది ఓటర్లను, ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీన వర్గాలు, రోజువారీ కూలీల ఓటరు జాబితా నుండి తొలగించేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
మన ఓటు హక్కులను దొంగిలించడమే కాదు, మన గుర్తింపుని కూడా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. నేడు ఓటు హక్కును లాక్కుంటే, రేపు ఉచిత ఆహారం, గృహనిర్మాణం వంటి ప్రభుత్వ పథకాలలో వాటాను కూడా నిరాకరిస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో ఎన్నికల కమిషన్ కూడా బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మరొక కంపార్ట్మెంట్‌గా మారిందని ఖేరా విమర్శించారు. ఈ ధోరణి దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీజీ ఎక్కడ యాత్ర ప్రారంభించినా, అది ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తుంది. ఈ ‘ఓటర్ అధికార్ యాత్ర’ దేశ ప్రజాస్వామ్యానికి మైలురాయిగా నిలుస్తుందని ఖేరా ధీమా వ్యక్తం చేశారు.
