Rahul Gandhi: రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని సంచలన ప్రకటన చేశారు.
Rahul Gandhi: రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కుల గణన నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. 'భారత్ జోడో న్యాయ్' యాత్రలో భాగంగా రాంచీలోపర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రజల్ని ఓట్లు అడిగేటప్పుడు తానో ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ..కులగణన డిమాండ్ విషయంలో మాత్రం రెండే కులాలున్నాయి..ధనిక,పేద అంటున్నారని విమర్శించారు.
దేశంలో కనీసం 50 శాతం వెనుకబడిన తరగతుల ప్రజలు, 8 శాతం గిరిజనులు, 15 శాతం దళితులు ఉంటారని, కానీ ఇప్పటికీ పెద్ద కంపెనీల్లో పదవుల్లో వారికి భాగస్వామ్యం లేదని అన్నారు. ముందుగా దేశంలో కుల గణన నిర్వహిస్తామని అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా బ్లాక్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని తెలిపారు. దళితులు , గిరిజనులకు ఇచ్చే రిజర్వేషన్లలో ఎలాంటి తగ్గింపు ఉండదనీ, సమాజంలోని వెనుకబడిన తరగతుల వారి అతిపెద్ద హక్కు సామాజిక, ఆర్థిక న్యాయం పొందుతారని తాను హామీ ఇస్తున్నానని అన్నారు. జార్ఖండ్‌లోని జేఎంఎం-కాంగ్రెస్-ఆర్‌జేడీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, మాజీ సీఎం గిరిజన సామాజికవర్గం నుంచి వచ్చారని రాహుల్ గాంధీ అన్నారు.