కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రేపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈడీ విచారణకు హాజరుకాబోతున్నారు. కేంద్రం కావాలనే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని, దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ వేసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకాబోతున్నారు. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ.. రాహుల్ గాంధీని విచారించనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ భారీ నిరసనకు ప్లాన్ వేసింది. దేశంలోని సుమారు 25 ఈడీ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకుంది.
దేశవ్యాప్తంగా సుమారు 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేస్తారని పార్టీ నేత మాణిక్కం ఠాగూర్ అన్నారు. ఈడీ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగిస్తున్నదని, దీనికి నిరసనగా తాము ప్రొటెస్ట్ చేయనున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ రేపు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన వెంట ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వరకు వెళ్లనున్నట్టు మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు.
ఒక ఫేక్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, సీనియర్ నేత రాహుల్ గాంధీలను ఇరికించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు ఈడీ, సీబీఐలను వినియోగిస్తున్నారని అన్నారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై మోపిన అభియోగాలు అవాస్తవాలను, నిర్హేతుకమైనవని కొట్టిపారేశారు. వీరికి ఈడీ సమన్లు జారీ చేయడం కేవలం బీజేపీ చేస్తున్న దుష్ట రాజకీయాల్లో భాగమేనని విమర్శించారు.
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై రెయిడ్‌లు జరుగుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, వీటికి వ్యతిరేకంగానే నిరసనలు చేస్తున్నట్టు చెప్పారు.
రాహుల్ గాంధీ రేపు ఈడీ ముందు హాజరు కానుండగా.. ఈ నెల 23న సోనియా గాంధీ ఈడీ ముందుకు వెళ్లనున్నారు. జూన్ 2వ తేదీనే ఆమెను తమ ముందు హాజరవ్వాలని ఈడీ సమన్లు పంపింది. కానీ, అదే రోజు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. రాహుల్ గాంధీకి కూడా అదే రోజు నోటీసులు పంపింది. కానీ, రాహుల్ గాంధీ తనకు ఇచ్చిన తేదీల్లో హాజరుకాలేదు. తాను హాజరుకాలేని పరిస్థితుల్లో తేదీని వాయిదా వేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవలకు చెందినదే ఈ కేసు. జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌ను యంగ్ ఇండియన్ కలిగి ఉంది.
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌ను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురించగా.. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ చేసుకుని ఉంది.
యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, యంగ్ ఇండియన్ పాత్రకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి తాము సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రశ్నించాలని భావిస్తున్నట్టు ఈడీ ఇటీవలే పేర్కొంది.
