కేరళలోని కోజికోడ్‌లోని కోడెంచెరిలో కమ్యూనిటీ డిసేబిలిటీ మేనేజ్‌మెంట్ సెంటర్‌కు రాహుల్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విభజన, ద్వేషం, ఆగ్రహావేశాలతో కూడిన రాజకీయాలను ఉపయోగించుకుంటే ఏం జరుగుతుందో మణిపూర్ ఎదుర్కొంటున్న పరిస్థితులే మనకు గుణపాఠమని అన్నారు.
మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ఆందోళన కలిగిస్తోందని, తక్షణమే ఆపాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూచించారు. రాహుల్ గాంధీ తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేరళలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం కోజికోడ్‌లో కమ్యూనిటీ డిసేబిలిటీ మేనేజ్‌మెంట్ సెంటర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. తన మణిపూర్ పర్యటన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో హింసాత్మకమైన విభజన, ద్వేషం కోపంతో కూడిన నిర్దిష్ట రాజకీయాల ప్రత్యక్ష ఫలితమని అన్నారు. కాబట్టి,అందరినీ ఒక కుటుంబంలా కలిసి ఉంచడం చాలా ముఖ్యమని అన్నారు.
గత కొన్ని రోజుల కిత్రం తాను మణిపూర్ వెళ్లాననీ, అక్కడ జరుగుతున్న దారుణాలను, ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను దగ్గర నుంచి చూశానని అన్నారు. మనిషిని రెండు ముక్కలు చేసినట్లే.. మొత్తం రాష్ట్రాన్ని ఎవరో రెండు ముక్కలు చేసినట్టు.. అక్కడ హింస, అత్యాచారం, హత్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. హింసాకాండ వల్ల తగిలిన గాయాలు మానడానికి చాలా సంవత్సరాలు పడుతుందని అన్నారు.
ఆ దుఃఖం, కోపం అంత తేలికగా పోవని అన్నారాయన. రాష్ట్రంలో విభజన, ద్వేషం, కోప రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో మణిపూర్‌లో జరిగిన హింసాకాండ తనకు గుణపాఠమని అన్నారు. భారతీయులుగా దేశమంతటా ప్రేమానురాగాలను పంచడం మన బాధ్యత అని అన్నారు. మణిపూర్ కు అయినా గాయాన్ని నయం చేయడం మనందరి కర్తవ్యమని అన్నారు. దేశంలో విభజన రాజకీయాలు చెలరేగకుండా చూసుకోవాలని, అలాంటి చర్యలను ఇక్కడితో ఆపివేయాలని హెచ్చరించారు.
