Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలకు ఏం జరుగుతుందో చూడండి.. మైక్ స్విచ్ ఆఫ్ చేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతుంది. బుధవారం (నవంబర్ 9) మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. ఈ సమయంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలకు ఏం జరుగుతుందో చూపేందుకు ఆయన తన మైక్రోఫోన్‌ను రెండు సార్లు ఆఫ్ చేశారు. 

Rahul Gandhi switches off his mic and says See this happens in Parliament
Author
First Published Nov 10, 2022, 4:01 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతుంది. బుధవారం (నవంబర్ 9) మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. ఈ సమయంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలకు ఏం జరుగుతుందో చూపేందుకు ఆయన తన మైక్రోఫోన్‌ను రెండు సార్లు ఆఫ్ చేశారు. నోట్ల రద్దు, చైనా చొరబాటు మొదలైన వాటిపై ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో మాట్లాడినప్పుడు మైక్ స్విచ్ ఇలానే ఆఫ్ చేస్తున్నారని చెప్పారు. 

నాందేడ్‌లో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘మీడియా మమ్మల్ని హైలైట్ చేసే స్థితిలో ఉండకపోవచ్చు కాబట్టి మేము ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించాము. పార్లమెంటులో మాకు ఏమి జరిగిందో చూడండి.. ’’ అంటూ రాహుల్ గాంధీ తన మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. రాహుల్‌గాంధీ మైక్రోఫోన్‌ ఆఫ్‌ చేసిన తర్వాత కూడా మాట్లాడటం కొనసాగించారు. తర్వాత కొన్ని సెకన్లకు చిరునవ్వుతూ మైక్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ.. ‘‘కనీసం ఇక్కడ మాకు నియంత్రణ ఉంది. పార్లమెంటులో వారు 2 నిమిషాల్లో దానిని ఈ విధంగా స్విచ్ ఆఫ్ చేస్తారు. మేము ఏం జరిగిందని ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటాం’’ అని అన్నారు. నోట్ల రద్దు, చైనా చొరబాటు.. ఇలా ఈ విషయంపై మాట్లాడిన మైక్ ఆఫ్ చేస్తున్నారని చెప్పారు. మాట్లాడుతూ ఉండగానే మైక్ ఆఫ్ చేస్తారని.. ఎవరూ వినకుండా చేస్తారని తెలిపారు. 

 


బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్న రాహుల్ గాంధీ.. ‘‘మీరు నాలుగేళ్లు దేశానికి సేవ చేయవచ్చు.. నాలుగేళ్ల తర్వాత దేశభక్తులు కాలేరు.. నాలుగేళ్ల తర్వాత ఇంటికి వెళ్లి మైక్ ఆఫ్ చేయండి.. ఇదే అగ్నివీర్’’ అని అన్నారు. ‘‘చైనా చొరబాట్లేమీ జరగలేదని ప్రధాని మోదీ చెప్పారు. అప్పుడు భారత్ వైపు, చైనా వైపు నుంచి ఏం మాట్లాడుకుంటున్నారు? 22 రౌండ్ల చర్చలు జరిగాయి. ఇదీ దేశ పరిస్థితి. అందుకే యాత్ర చేపట్టాం’’అని రాహుల్ గాంధీ అన్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక, శుక్రవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రీతా సూలే, జయంత్ పాటిల్, శివసేన నేత ఆదిత్య ఠాక్రే పాల్గొననున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios