తమ పేపర్లను రీ వాల్యూయేషన్ చేయాలంటూ ఆందోళన చేస్తున్న సీఏ విద్యార్ధులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్ధతుగా నిలిచారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఛార్టెడ్ అకౌంటెన్సీ విద్యార్ధులు ఈ విషయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పేపర్ వాల్యుయేషన్‌లో తప్పులు దొర్లాయని అందువల్ల తిరిగి రీ-వాల్యుయేషన్ కోరే హక్కు విద్యార్ధులకు ఉందని రాహుల్ తెలిపారు. సీఏ విద్యార్ధుల న్యాయమైన డిమాండ్‌కు దేశంలోని అన్ని పార్టీల నేతలు బాసటగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా.. పరీక్షా పత్రాల మూల్యంకనం సందర్భంగా రెండు, మూడు దశల్లో అధికారులు ఉద్దేశ్వపూర్వకంగానే మార్కులు తగ్గించారంటూ సీఏ విద్యార్ధులు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు.

న్యూఢిల్లీలోని ఛార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రాల్లోని రీజనల్ కార్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఐసీఏఐ నిబంధనల్లోని సెక్షన్ 39 ప్రకారం పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతాన్ని తగ్గించడానికి లేదా పెంచడానికి ఐసీఏఐకి ఉన్న అధికారమే వివాదానికి కారణమైందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.