కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు చట్టాలను 'వ్యవసాయ వ్యతిరేక చట్టాలు'గా అభివర్ణించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.

ఇప్పటికైనా ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో నిస్సహాయ పరిస్థితిలోనే రైతులు తమ ఆందోళనను గాంధీ జయంతి (అక్టోబర్) వరకూ కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారని రాహుల్ తెలిపారు.

అప్పటి వరకూ ఆందోళన కొనసాగించాలని రైతులు, ఉద్యమంలో పాల్గొంటున్న వారు నిర్ణయానికి వచ్చారంటే మోడీ ప్రభుత్వంపై వారికెంత నమ్మకం ఉందో అర్ధమవుతోందంటూ రాహుల్ సెటైర్లు వేశారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దురహంకారం వీడనాడాలని.. రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని  ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.

కాగా, రైతు ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. టిక్రి (ఢిల్లీ-హర్యానా) సరిహద్దుల్లో రైతుల ఆందోళన 74వ రోజుకు చేరుకోగా, ఘజిపూర్ (ఢిల్లీ-ఉత్తరప్రదేశ్) సరిహద్దులో ఆందోళన 72వ రోజుకు చేరింది.

మరోవైపు చట్టాల్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.  

కాగా, శనివారం నిర్వహించిన చక్కా జామ్‌ అక్కడక్కడ ఉద్రిక్తతలు తప్పించి దేశమంతటా ప్రశాంతంగా ముగిసింది. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకూ ఢిల్లీ సరిహద్దులను వీడేదిలేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ ప్రకటించారు.

చట్టాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరు 2 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నట్లు తెలిపారు. తాము రైతులం... సైనికులం అనేది ఇక మీదట తమ ఉద్యమ నినాదంగా ఉంటుందని వెల్లడించారు.