ఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టు తీర్పును తాముస్వాగతిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే అబద్దాలను ప్రచారం చేశారని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టించిందని అమిత్ షా మండిపడ్డారు. రాఫెల్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు గానూ దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాఫెల్ పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. ఒక అబద్దాన్ని రాహుల్ పదేపదే ప్రచారం చేశారు అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ అబద్దాలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని అన్నారు. 

రాఫెల్ డీల్ లో అనుమానించాల్సిన అంశాలు ఏమీ లేవని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వల్ల దేశానికి మేలు జరిగిందే తప్ప అన్యాయం జరగలేదని ఎలాంటి అవినీతికి తావు లేదని చెప్పుకొచ్చారు. 

కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని కాంగ్రెస్ లా తాము అవినీతికి పాల్పడ్డామని ఆరోపిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. రాఫెల్ డీల్ పై జేపీసీ ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాఫెల్ డీల్ పై చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీయే సిద్ధంగా లేదని ఆరోపించారు. 

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుపై వివరణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నా లేనట్లు కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముదు రాజ్యసభలో కానీ, పార్లమెంట్ లో కానీ చర్చించాలి కదా అంటూ సూచించారు. చర్చలకు రారు కానీ అసత్యాలు మాత్రం ప్రచారం చేస్తారు అంటూ విరుచుకుపడ్డారు.